వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఐదారు నెలలుగా వేతనాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఏండ్ల తరబడిగా అరకొర వేతనాలతో కాలం గడుపుతున్న ఈ చిరుద్యోగులకు ఇచ్చే వేతనాలు కూడా సరిగ్గా రావడం లేదు. ఆందోళనలు చేసినా, సమ్మెకు వెళ్లినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం కనిపించడం లేదు. ఏప్రిల్‌లో చేయాల్సిన రెన్యువల్ జూలైలో చేయడం, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నామని నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా సతాయిస్తోంది. అతిపెద్ద పండుగైన దసరాకు కూడా వీరి వేతనాలు వస్తాయన్న నమ్మకం కనిపించడం లేదు. పండుగ పూట కూడా పస్తులుండాల్సిన దుస్థితి వచ్చిందని ఆ చిరుద్యోగులు వాపోతున్నారు.
కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతోంది. ఏండ్ల తరబడిగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెల నెలా వేతనాలు రాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. అప్పులు చేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్నారు. విద్య, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జిల్లాలో 4 వేలకు పైగానే ఉన్నారు. వీరిని ఏజెన్సీల ద్వారా రిక్రూట్ చేసుకుని వాటి ద్వారానే వేతనాలు చెల్లిస్తున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత ఐదారు నెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఇప్పటికే అనేకసార్లు ఆందోళనలు చేశారు. అయినా, అందలేదు. ప్రభుత్వ జనరల్ దవాఖానల్లోనే ఎక్కువ మంది పని చేస్తుండగా అనేక సార్లు విధులు బహిష్కరించి ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. విద్యాశాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు వస్తున్నా ఏడాదిలో నెల వేతనం కోత పెడుతున్నారు.
ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. గతేడాది డిసెంబర్ నుంచి వీరికి వేతనాలు రావడం లేదు. ఒక పీరియడ్‌కు రూ.390 చొప్పున వీరికి చెల్లిస్తుంటారు. ఎన్ని పీరియడ్ చేబితే అంతే వేతనం వస్తుంది. జూనియర్ లెక్చరర్ల నియామకం తర్వాత వీరిలో అనేక మందిని తొలగించడంతో వీధిన పడ్డారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేసే కొన్ని క్యాడర్ల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆందోళనలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెప్పరాని కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ గత ఎన్నికల సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. విద్యా శాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇప్పటికే సమ్మెకు వెళ్లారు. గత డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు విధులు బహిష్కరించి 28 రోజుల పాటు సమ్మె చేశారు.
తమను విద్యాశాఖలో విలీనం చేయాలనే ఏకైక ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు వెళ్లిన ఈ ఉద్యోగులను మభ్యపెట్టి ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చ లేదు. అంతే కాకుండా, ఏడాదిలో నెల వేతనం కోత విధిస్తున్నారు. ఇచ్చినపుడే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఇప్పటికే అనేక సార్లు ఆందోళనలు నిర్వహించారు. చిరుద్యోగులైన వీరికి నెల నెలా వేతనాలు అందక పస్తుండాల్సిన పరిస్థితి దాపురించింది.
కరీంనగర్, జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్ల ఎదుట అనేక సార్లు ఆందోళనలు నిర్వహించారు. విధులు బహిష్కరించి తమ గోడును వెళ్లబోసుకున్నా ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఈ నెల, వచ్చే నెల అంటూ ఏజెన్సీలు కాలం గడుపుతున్నాయి. అది నమ్మి అప్పుసప్పు చేసుకుని సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. తమకు కడుపు లేదా?, ఇల్లు పిల్లలు లేరా? అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
రెన్యూవల్ చేయడంలో తాత్సారం
ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్‌లో రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈసారి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జూలైకి జరిగింది. ఆ నెలలో రెన్యూవల్ జరిగినా మరుసటి నెల నుంచే వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న వేతనం కూడా ఇవ్వాలి. కానీ, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా వేతనం చెల్లించిన పరిస్థితి లేదు.
వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని సదరు ఏజెన్సీలను ప్రశ్నించే సిబ్బందికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఔట్సోర్సింగ్ సిబ్బందిని సమకూర్చుతున్న ఏజెన్సీలను రద్దు చేసి కొత్తగా కొన్నింటిని ఎంప్యానల్లో చేర్చినట్లు తెలుస్తోంది. అర్హత లేని ఏజెన్సీలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వేతనాలు చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
పండగ పూట పస్తులేనా.?
కనీసం ఈ దసరా పండుగకైనా పెండింగ్ వేతనాలు చెల్లిస్తే తమ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. ఆందోళనలు, ధర్నాలు చేసి ఆయా శాఖల ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఇప్పటి వరకు వేతనాలు చేతికి అందక పోవడంతో వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ధర్మపురి దవాఖాన ఎదుట ధర్నా
ధర్మపురి, సెప్టెంబర్ 20 : తెలంగాణ వైద్యవిధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్సోర్సింగ్, సానిటేషన్ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు రాక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పండుగ పూటనైనా కడుపునిండా తినేటట్లు జీతాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి దవాఖాన ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. దసరా పండుగ సందర్భంగానైనా జీతాలు ఇవ్వాలని వేడుకున్నారు. అనంతరం దవాఖానలో పనిచేసే 16 మంది సిబ్బంది సూపరింటెండెంట్ రవికి వినతి పత్రం అందజేశారు.
ఇవ్వకుంటే మరింత ఆందోళన
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు నాలుగైదు రోజుల్లో చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఇప్పటికే మా యూనియన్ ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అనేకసార్లు ఆందోళన చేశాం. కానీ, ప్రభుత్వంలో చలనం లేదు. ఐదు నెలలుగా వేతనాలు లేక పోవడంతో కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చింది. ఏ కారణం చేత వేతనాలు ఆపుతున్నారని అడిగితే సరైన సమాధానం ఇటు ఏజెన్సీలుగాని, అటు ప్రభుత్వ అధికారులుగాని చెప్పడం లేదు.
కనీసం పండగ పూటనైనా వీరి వేతనాలు చెల్లించి మానవత్వాన్ని చాటు కోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఆందోళన చేసినపుడు తక్షణమే వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. పది రోజులు గడుస్తున్నా వేతనాల జాడ లేదు. చిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకూడదు.
– బండారి శేఖర్, ప్రభుత్వ హాస్పిటల్స్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
కూరగాయలు కొందామంటే పైసల్లేవు
ధర్మపురి దవాఖానలో స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటు న్న. నాకు నెలకు రూ.12 వేల జీతం వస్తది. భర్త లేడు. దవాఖానలో పనిచేసుకుంట ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్న. ఆరో గ్యం సహకరించకపోయినా పని చేస్తున్న. గత ఆరునెలలుగా జీతాలు రాక కూరగాయలు కొనుక్కుందామంటే పైసల్లేవు. 10 రోజుల్లో దసరా పండుగ ఉన్నది. జీతం రాకపోతే పండుగ జరుపుకునుడు ఎట్ల. అధికారులు స్పందించి జీతాలు ఇప్పించాలి.
– శనిగారపు గంగు, స్వీపర్
తలుచుకుంటే దుఃఖమత్తుంది.. బాంచెన్
ధర్మపురి ప్రభుత్వ దవాఖానలో స్వీపర్‌గా పనిచేస్తున్న. ఆరు నెలలుగా జీతాలు వస్తలేవు. అడిగితే ఏందో ప్రా బ్లం అంటున్నరు. మా ప్రాబ్లం పట్టించుకుంటలేరు. అప్పులు చేసి బతుకుతున్నం. సగం కడుపుకే తింటున్నం. పండుగ పూటనైనా కడుపునిండా తినేటట్టు జీతం ఇయ్యాలె సారూ.. బాంచెన్!
– కొప్పుల భాగ్య, స్వీపర్