వేములవాడ, మే 14 : వేములవాడ పట్టణం బంద్ సక్సెస్ అయింది. అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని వచ్చే నెల 15 నుంచి మూసివేయాలని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్కు విశేష స్పందన వచ్చింది. తిప్పాపూర్ బస్టాండ్, మూలవాగు వంతెన నుంచి జాతర గ్రౌండ్, ప్రధానాలయం రహదారి, పాత ఆంధ్ర బ్యాంక్, బద్ది పోచమ్మ వీధి నుంచి కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకురాగా, దుకాణాలు, వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. వీధులన్నీ వెలవెలబోయి కనిపించాయి. ఈ సందర్భంగా ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రామతీర్థపు రాజు పలువురు నాయకులతో కలిసి పట్టణంలో పాదయాత్ర తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిబద్ధత లేదని విమర్శించారు.
ఆలయానికి మొత్తం ఎన్ని కోట్లు మంజూరయ్యాయి? పూర్తి బడ్జెట్ ఎంత? అనేది చెప్పకుండా, అభివృద్ధి నివేదికలను బహిర్గతం చేయకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. వాస్తు పేరిట రాజన్న ఆలయంలోని పలు అంతర్ దేవాలయాలను ముట్టుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఏకపక్ష నిర్ణయాలతో ముందుకుపోవడమే సరికాదన్నారు. అలయాన్ని మూసివేయాలనే నిర్ణయం సరికాదని, భక్తులకు దర్శనానికి అనుమతినిస్తూనే, అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ పట్టణంలోని ప్రధాన ప్రాంతాలు, కూడళ్లలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నిమ్మ శెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, నరాల శేఖర్, జోగిని శంకర్, నాయకులు రేగుల మల్లికార్జున్, పిన్నింటి హన్మాండ్లు, కృష్ణస్వామి, గోపు బాలరాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మంద రాజేందర్ ఉన్నారు.