Karimnagar | కార్పొరేషన్, జూన్ 6 : కరీంనగర్ నగరపాలక సంస్థలో అధికారులు చేపట్టిన డివిజన్ల పునర్ విభజన తీరుపై అన్ని వైపుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నగరంలో అన్ని పార్టీల నేతల నుంచి డివిజన్ల స్వరూపాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా డివిజన్ల భౌగోళిక స్వరూపాల తీరుపై కూడ తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వస్తున్నాయి. అధికారులు కేవలం ఇంటి నంబర్లను పరిగణనలోకి తీసుకొని డివిజన్లు విభజించటంపై విమర్శలు వస్తున్నాయి.
దీని వల్ల డివిజన్ పరిధి భారీగా పెరిగిందని, ఆ మేరకు ఓటర్ల సంఖ్య తక్కువగా వస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు జారీ చేసిన ముసాయిదాలో ప్రతీ డివిజన్‌లోనూ 5 వేల ఓటర్లు ఉన్నట్లు అధికారులు చూపించారు. అయితే మాజీ కార్పొరేటర్లు, బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన నగర నాయకులు మాత్రం ఆ మేరకు ఓట్లు లేవని ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. విభజన తీరుపై రెండు రోజుల్లోనే 30కి పైగా ఫిర్యాదులు వచ్చాయి.
భౌగోళిక తీరుపై అభ్యంతరాలు
నగరపాలక అధికారులు ప్రకటించిన డివిజన్ల ముసాయిదా జాబితాలో డివిజన్ల బౌగోళిక స్వరూపాయలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నగర నేతలు డివిజన్లన్ని కూడ అడ్డదిడ్డంగా విభజించారన్న విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కిలోమీటర్ల పొడవును డివిజన్లు ఏర్పాటు చేయటం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు ముకరంపురలోని పాత కాన్చీట్ నుంచి మొదలు కొని దాదాపుగా రాంనగర్ రస్తా వరకు వచ్చే విధంగా ఓ డివిజన్‌ను రూపొందించటం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. కనీసంగా ప్రధాన రహదారులను కూడా పరిగణనలోకి తీసుకోకపోవటం, కేవలం ఇంటి నంబర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడేమంటని ప్రశ్నిస్తున్నారు.
అనేక డివిజన్లు భౌగోళికంగా చాలా దూరంగా ఉండే విధంగా అధికారులు విభజన చేశారని పేర్కొంటున్నారు. దీని వల్ల భవిష్యత్తులో పారిశుద్ద్య పనులు, ఇతర వాటికి తీవ్ర ఇబ్బందులు వస్తాయని కూడ చెప్పుతున్నారు. దీంతో పాటుగా పలు డివిజన్ల తీరు చూస్తే మధ్యలో మరో డివిజన్ ఓటర్లు వచ్చే విధంగా ఈ విభజన తీరు ఉందని పలువురు నేతలు పేర్కొంటున్నారు. అలాగే ముసాయిదాలో ప్రతి డివిజన్‌లోనూ 4600 నుంచి కనీసంగా 5000 ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు.
కానీ పలు డివిజన్ల ఇంటి నంబర్లను ఆదారం చేసుకొని ఓటరు సంఖ్యను పరిశీలిస్తే కొన్ని డివిజన్లల్లో కేవలం 2500 ఓట్లు, కొన్ని డివిజన్లలో 3000 ఓట్లు, మరి కొన్ని డివిజన్లలో 8000 ఓట్లు ఉన్నట్లు మాజీ కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో నగరపాలక అధికారులు పర్యటించకుండా కనీసం ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకొకుండా ఇష్టరాజ్యంగా డివిజన్లను రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిర్యాదుల వెల్లువ.. రెండు రోజుల్లోనే 30 అభ్యంతరాలు
డివిజన్ల విభజనపై అన్ని పార్టీల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నగర శాఖ డివిజన్ విభజన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా ఆదారాలతో కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అలాగే బీజేపీ నాయకులు కూడా అభ్యంతరాలను చెప్పుతున్నారు. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు సైతం తమ డివిజన్ల విభజన తీరుపై తమ అభ్యంతరాలను చెప్పుతున్నారు. దీనిలో భాగంగా డివిజన్ల విభజనపై అభ్యంతరాల స్వీకరణ చేపట్టగా రెండు రోజుల్లోనే 30కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. నగరంలోని ప్రస్తుత 30 డివిజన్‌ను ఇష్టరాజ్యంగా విభజించారని దీనిపై తగు చర్యలు తీసుకొవాలని మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, బుచ్చిరెడ్డి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
నగరంలో చేపట్టిన డివిజన్ల విభజన పూర్తిగ అశాస్త్రీయంగా ఉందని మాజీ మేయర్ సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్‌లు ఆరోపించారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ తనకు అనుకూలంగా డివిజన్లు విభజించిందని ఆరోపించారు. ఎంఐఎంకు అనుకూలంగా ఉండే విధంగా డివిజన్లను విభజించారని ఆరోపించారు. అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన డివిజన్ల తీరుపై వెంటనే కలెక్టర్ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ తరఫున తమ అభ్యంతరాలను కలెక్టర్‌కు విన్నవిస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్సయ్య, విలాస్‌రెడ్డి, పిట్టల శ్రీనివాస్, పడిశెట్టి బూమయ్య, బీఆర్ఎస్ నాయకులు బండారి వేణు తదితరులు ఇప్పటికే డివిజన్ తీరుపై ఫిర్యాదులు చేశారు.