రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గంగానగర్‌కు చెందిన ఓ యువకుడు పదోతరగతి ఫెయిల్ అయ్యాడు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి. దీంతో స్థానికంగా తెలిసిన ఒక మేస్త్రీ వద్ద రోజుకు 300 కూలీతో పనిలో చేరాడు. ఏండ్లు గడుస్తున్నా అరకొర వేతనంతోనే జీవనం కొనసాగించాల్సిన దుస్థితి. దీంతో తాను పనిచేసే వృత్తిలోనే స్కిల్ పెంచుకుంటే మంచి ఉపాధి అవకాశాలు వస్తాయని అనుకున్నాడు. న్యాక్ సెంటర్లో చేరి 15 రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాడు. వారు ఇచ్చిన సర్టిఫికెట్ ద్వారా మంచి వేతనంతో మల్టీ నేషనల్ కంపెనీ(ఎంఎన్సీ)లో ఉద్యోగం సాధించాడు.
అసంఘటిత రంగంలోని అన్‌స్కిల్డ్ లేబర్‌కు మెరుగైన శిక్షణ ఇచ్చి, స్కిల్డ్ లేబర్‌గా తీర్చిదిద్దుతున్నది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ-న్యాక్). రాష్ట్ర ప్రభుత్వ చొరవతో 2016లో గోదావరిఖని, కమాన్‌పూర్ సెంటర్లలో సుమారు 60 బ్యాచ్‌ల ద్వారా 5,200 మందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధికి భరోసానిచ్చింది. 15 రోజుల ట్రైనింగ్ సమయంలో రోజుకు రూ. 300 చొప్పున ఉపకారవేతనం, మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నది. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ఎంఎన్సీ కంపెనీలు, విదేశాల్లో పని చేసే విధంగా వారికి సర్టిఫికెట్‌ను సైతం అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.
– పెద్దపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, 24 ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ) : రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా, పట్టణీకరణతో భవననిర్మాణరంగం ఊపందుకున్నది. ఈ రంగంలో కూలీల అవసరం రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే ఆరునెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణాలు, అన్‌స్కిల్డ్ లేబర్‌తో ఏండ్లు గడుస్తున్నా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. స్కిల్డ్ లేబర్‌కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో అన్‌స్కిల్డ్ లేబర్‌కు శిక్షణిస్తూ, స్కిల్డ్ లేబర్‌గా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ-న్యాక్). తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో 2016 నుంచి జిల్లాలోని గోదావరిఖని, కమాన్‌పూర్‌లో శిక్షణ కేంద్రాలను నెలకొల్పింది. మేషన్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్లకు బ్యాచ్‌ల వారీగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నది. సుమారు 60 బ్యాచ్‌ల ద్వారా 5,200 మందిని స్కిల్డ్ లేబర్‌గా తయారు చేసింది. వివిధ ఎంఎన్సీ కంపెనీలు, విదేశాల్లో పని చేసే విధంగా వారికి సర్టిఫికెట్‌ను సైతం అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.
రోజుకు 300 ఉపకారవేతనం
15 రోజుల శిక్షణ కాలంలో వృతి నైపుణ్యాలను పెంచుతున్నారు. ఈ కేంద్రం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పనిచేసే గృహ నిర్మాణ రోజువారీ కూలీలకు వారు ఎంచుకున్న మేషన్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌కు రోజుకు 300 చొప్పున ఉపకారవేతనం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఒక బ్యాగ్ ద్వారా టీషర్ట్, హెల్మెట్, నోట్ బుక్, పెన్ను, హ్యాండ్ అవుట్ బుక్ అందిస్తున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. రోజూవారీ వృత్తిలో జరిగే ప్రమాదాల బారిన పడకుండా మెళకువలు కూడా నేర్పిస్తున్నారు.
ఉపాధికి అవకాశాలు
వృత్తి నైపుణ్యం ఉన్నా గుర్తింపు లేనివారికి న్యాక్ ద్వారా అందించే ట్రైనింగ్ సర్టిఫికెట్ టెక్నికల్ గుర్తింపును ఇస్తున్నది. చదువుతో సంబంధం లేకుండా ఆ సర్టిఫికెట్తో విదేశాల్లో పనిచేయాలన్నా.. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం చేయాలన్నా మంచి జీతంతో ప్యాకేజీ లభిస్తున్నది. న్యాక్ ద్వారా మెరుగైన శిక్షణ నైపుణ్యాలున్న ఈ కార్మికులు భవిష్యత్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించేలా ఉపయోగపడుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్మాణ రంగంలో వస్తున్న పెను మార్పులను అందిపుచ్చుకునేలా వారికి శిక్షణ ఉంటున్నది. ఇప్పటికే శిక్షణ పొందిన వారిలో చాలా మంది ఎంఎన్సీ కంపెనీల్లో, విదేశాల్లో ఉపాధి పొందుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
గోదావరిఖని, కమాన్‌పూర్ న్యాక్ కేంద్రాల ద్వారా భవననిర్మాణ రంగంలోని కూలీలకు నైపుణ్య శిక్షణ అందించి, సర్టిఫికెట్ అందిస్తాం. దీని ద్వారా ఎంఎన్సీ కంపెనీల్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే 5200 మందికి శిక్షణ పూర్తి చేశాం. ఈ అవకాశాన్ని మిగతా కూలీలు, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. శిక్షణ కాలంలో సైతం వారికి భోజనం, ఉపకారవేతనం సైతం అందిస్తాం. సర్టిఫికెట్ ద్వారా టెక్నికల్‌గా గుర్తింపు లభిస్తుంది.
-రాంనారాయణ, న్యాక్ సెంటర్ ఇన్చార్జ్ (గోదావరిఖని)
ఇది మంచి అవకాశం
మాది కమాన్‌పూర్. నేను ఓ మేస్త్రీ దగ్గర కూలీ పని చేస్తుండె. ఇప్పుడు న్యాక్ కేంద్రం ద్వారా శిక్షణ తీసుకుంటున్న. దీని ద్వారా తక్కువ సమయంలో నైపుణ్యంతో పనిని ఎలా చేయాలో నేర్పిస్తున్నరు. అలాగే, శిక్షణ పూర్తైన తర్వాత సర్టిఫికెట్ ఇచ్చి, వాళ్లే ఉపాధి అవకాశాలు కల్పిస్తరట. గ్రామాల్లో పనిచేసే వారికి వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఇది మంచి అవకాశం.
-కొమ్ము సారయ్య, శిక్షణ పొందుతున్న భవన నిర్మాణ కార్మికుడు (కమాన్‌పూర్)
ఇండ్లను ఎలా అందంగా తీర్చిదిద్దాలో నేర్చుకున్న
నాకు ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు, ముగ్గులు వేసే అలవాటు ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్ట్రక్చర్, డిజైన్స్ వేయడం నేర్చుకున్న. పుట్టి పెట్టడం, ప్రైమర్ ఎలా వాడాలో తెలుసుకున్న. మెటల్ ప్రైమర్స్తో భవనాలకు ఎలా కొత్త రూపు తీసుకురావాలో నేర్చుకున్న. కలర్స్ ద్వారా ఇండ్లను ఎలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలో తెలుసుకున్న. ఈ శిక్షణ నాకు చాలా ఉపయోగపడుతుంది.
-కమ్మగోని మౌనిక, పెయింటింగ్ శిక్షణ పొందుతున్న మహిళ (కమాన్‌పూర్)
ఎలా పనిచేయాలో నేర్పించిన్రు
నేను గతంలో ఓ మేస్త్రీ దగ్గర పనికి వెళ్లేదానిని. పదేండ్లుగా ఇదే పని చేస్తున్న. కానీ, మాల్ ఎలా కలపాలి? ఎంత కలపాలి? అనే మెళకువలు ఇక్కడే నేర్చుకున్న. సిమెంటు, కంకర, ఉసిక, నీళ్లు ఎంత కలిపితే ఎంత నాణ్యతగా నిర్మించవచ్చు అనేది ఇక్కడ నేర్పించిన్రు. ముఖ్యంగా చేసే పనిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా.. అనారోగ్యం బారిన పడకుండా ఎలా పనిచేయాలో నేర్పించిన్రు.
– చొప్పరి లక్ష్మి, శిక్షణ పొందుతున్న భవన నిర్మాణ కార్మికురాలు (కమాన్‌పూర్)