ముంబై, అక్టోబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లలో హెల్త్‌కేర్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గురువారం కూడా మెజారిటీ ఫార్మా, హాస్పిటల్స్ షేర్లు నష్టాలకే పరిమితమయ్యాయి. నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ మరో 43.05 పాయింట్లు లేదా 0.27 శాతం పడిపోయి 16,095.55 వద్ద ముగిసింది. బుధవారం ఏకంగా 424.90 పాయింట్లు లేదా 2.57 శాతం పతనమైన విషయం తెలిసిందే.
రిటైలర్లు కొంటున్న ఔషధాల ధరలకు.. వాటిని వినియోగదారులకు అమ్ముతున్న రేట్లకు ఎందుకు చాలా తేడా ఉంటున్నదని సుప్రీం కోర్టు ఓ కేసు విచారణలో భాగంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫార్మా సంస్థల లాభాలపై మదుపర్లకు గుబులు పట్టుకున్నది. ఆయా కంపెనీల షేర్లలో పెట్టుబడుల ఉపసంహరణలకు దిగుతున్నారు. ఓ క్యాన్సర్ ఔషధాన్ని కొనుగోలుదారునికి రూ.27,000కు అమ్మారని, రిటైలర్‌కు అది రూ.3,000కే వచ్చిందని జస్టిస్ సందీప్ మెహెతా గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలోనే ఓ ఔషధానికి రిటైలర్ కొన్న రేటుపై 16 శాతం మించకుండా గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)ను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఈ నెల 12 తదుపరి విచారణ జరుగనుండగా.. ఆ వచ్చే తీర్పు ఫార్మా కంపెనీల లాభాలకు గండికొట్ట వచ్చన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. అపోలో హాస్పిటల్స్ షేర్ 1.05 శాతం దిగింది. కిమ్స్ షేర్ వాల్యూ 0.86 శాతం క్షీణించింది.
స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ నష్టాల్లోనే ముగిశాయి. గురువారం సెన్సెక్స్ 570.59 పాయింట్లు పడిపోయి 71,909.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 198.50 పాయింట్లు దిగజారి 22,421.95 వద్ద నిలిచింది. సెన్సెక్స్ షేర్లలో మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాలను చవిచూశాయి.