న్యూఢిల్లీ, అక్టోబర్ 1: బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్, ఖర్చులు, కమీషన్లకు సంబంధించి భారీ మార్పులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. వినియోగదారుల రక్షణ, తప్పుడు పాలసీల విక్రయాలను అడ్డుకోవడం, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలకు స్వస్తి పలుకడమే ధ్యేయంగా ఈ ప్రతిపాదనల్ని చేసింది. దీంతో బీమా బిల్లులకు ముకుతాడు పడుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ పాలసీదారులకు లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జీవిత బీమాకు సంబంధించి తొలి ఏడాదిలో డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ గరిష్ఠంగా 20 శాతంగానే ఉండాలని ఐఆర్డీఏఐ అంటున్నది. ఏజెంట్లకు 25 శాతంగా ప్రతిపాదించింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న దాంట్లో ఇది సగానికంటే తక్కువే. దీంతో బీమా కోసం పాలసీదారులు చేసే ఖర్చు పెద్ద ఎత్తునే దిగివచ్చే వీలుండగా.. పాలసీబజార్, టర్టిల్ మింట్ వంటి ఆన్లైన్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ల ఆదాయానికి గండిపడే అవకాశాలున్నాయి.
బీమా సంస్థలు తమ నిర్వహణపరమైన ఖర్చుల్ని క్రమేణా తగ్గించుకోవాలని ఐఆర్డీఏఐ సూచించింది. లైఫ్ ఇన్సూరర్లు రెండేండ్లలో తమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయంలో ఖర్చుల్ని 15 శాతానికి, ఐదేండ్లలో 12.5 శాతానికి కట్టడి చేసుకోవాలన్నది. జనరల్ ఇన్సూరర్లు ఐదేండ్లలో 20 శాతానికి పరిమితం చేసుకోవాలన్నది. దీనివల్ల తక్కువ, సరసమైన ధరలకే బీమా సదుపాయాన్ని కస్టమర్లకు అందించవచ్చని పేర్కొన్నది.
నూతన వాహన కొనుగోలుదారులు తమ మోటార్ ఇన్సూరెన్స్‌ను ఎక్కడైనా కొనవచ్చు. డీలర్లు లేదా తయారీదారుల బండిల్డ్ పాలసీలను తీసుకోనక్కర్లేదని ఐఆర్డీఏఐ చెప్తున్నది. అలాగే బ్యాంకర్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు.. రుణాల మంజూరులో కస్టమర్లకు క్రెడిట్ లింక్డ్, మార్ట్గేజ్ లింక్డ్ బీమాలను బలవంతంగా అంటగట్టరాదన్నది. తనకు కావాల్సిన సరైన బీమాను ఎంచుకునే స్వేచ్ఛ పాలసీదారులకు ఉందని, బీమా సంస్థలు ఏజెంట్ల ద్వారా ఎలాంటి ఒత్తిళ్లు చేయరాదని చెప్పింది.