Peddapally | పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 22 : గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి కాళిందిని అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, హన్మంతునిపేట గ్రామాల్లో ఆమె స్వచ్ఛతహి సేవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో సోమవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనిపించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు చేసి బిల్లుల కోసం ఈకేవైసీ సమస్య ఉన్నవారందరి ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శులు చాతరాజు తిరుపతి, గ్రామపాలన అధికారి కే అంజలి తదితరులు పాల్గొన్నారు.