శంకరపట్నం (మానకొండూర్ రూరల్), ఆగస్టు 3 : మంత్రుల కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని ఒకరు గాయపడ్డారు. శంకరపట్నం శివారులో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక వెంకటేశ్వర గార్డెన్లో నిర్వహించగా, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఉత్తంకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.
కార్యక్రమం పూర్తి కాగానే మంత్రుల కాన్వాయ్ గట్టుదుద్దెనపల్లికి బయలుదేరగా, గార్డెన్ సమీపంలో మంత్రుల కాన్వాయ్‌లోని ఓ వాహనం ఓ ద్విచక్రవాహనదారుడిని తప్పించబోయి అదుపు తప్పింది. కాన్వాయ్ వాహనం వెనుక చక్రం వద్ద ఉన్న రేకు తాకడంతో శంకరపట్నంకు చెందిన సల్ల వెంకటయ్య రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో వెంకటయ్యకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి ఏసీపీ శ్రీనివాస్జీతోపాటు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.