ఆది నుంచీ గులాబీ పార్టీకి అండగా నిలిచిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న ఉత్సాహాన్ని చూసి.. అందుకు అనుగుణంగా సభకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
చాలాచోట్ల స్వచ్ఛందంగా ఎవరికి వారే వాహనాలు సమకూర్చుకొని సభకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, ఆయా నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వెళ్లే ప్రజలు, నాయకులకు కావాల్సిన తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లా రజతోత్సవ సభలోనూ తనదైన ముద్ర వేసుకుంటుందన్న అభిప్రాయాలను ఆయా నియోజకవర్గాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు సర్వం సన్నద్ధమవుతున్నది. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే ఈ సభకు అత్యంత ప్రాధాన్యత ఉందన్న భావన ఇటు ప్రజల్లోనూ.. అటు పార్టీ శ్రేణుల్లోనూ బలంగా ఉన్నది. నాడు ఉద్యమానికి ఊపిరి పోసి.. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించి.. పాలన పగ్గాలు చేపట్టిన తొలి పదేళ్లలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా కేసీఆర్ నిలిపిన విషయం తెలిసిందే.
చాలా సందర్భాల్లో కేంద్రం అనేక పథకాలను ఆదర్శంగా తీసుకొని ప్రశంసించిన విషయం కూడా విదితమే. రైతుబంధు లాంటి పథకం దేశానికి ఒక దిశ-దశ చూపింది. అలాగే మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ, రైతు బీమా వంటి ఎన్నో పథకాలు దిక్సూచిగా మారాయి. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో ముందుకెళ్తున్న విషయాన్ని అనేక నివేదికలు, సర్వేలు బహిర్గతం చేస్తున్నాయి. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సైతం కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి.
రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, వివిధ వర్గాలు పడుతున్న కష్టాలు, అడుగంటిన భూగర్భజలాలు, కరెంటు కోతలు, పడిపోయిన రియల్ ఎస్టేట్ రంగం ఇలా ఏ కోణంలో, ఏ రంగంలో చూసినా తిరోగమనమే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రజతోత్సవ సభ ప్రాధాన్యత సంతరించుకున్నది. నిజానికి బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేసి.. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతున్నది.
శ్రేణుల్లో ఉత్సాహం
రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత నెల 23న ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమావేశం కరీంనగర్లో నిర్వహించారు. ఆ మీటింగ్‌లోనే జనసమీకరణపై చర్చించి ఒక రూట్‌మ్యాప్ వివరించి వెళ్లారు. ఆయన ఆదేశాల ప్రకారం ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు.. తమ తమ నియోజకవర్గాల నుంచి వీలైనంత ఎక్కువగా ప్రజలు, నాయకులను సభకు తరలించేందుకు వీలుగా ఇప్పటికే అన్నిచోట్ల మీటింగ్‌లు నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో మండలాల వారీగా సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు.
ప్రతి సన్నాహక సమావేశం కూడా విజయవంతమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయా సమావేశాలకు పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలి రావడంతోపాటు రజతోత్సవ సభకు వెళ్లడానికి తమకు తాముగా చేసుకుంటున్న ఏర్పాట్లను వివరించిన తీరు.. వారిలో ఉత్సాహానికి నిదర్శనంగా చెప్పవచ్చన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలను చూస్తే.. ప్రతి నియోజకవర్గం నుంచి లక్ష్యానికి మించి ప్రజలు, శ్రేణులు వెళ్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, సాధ్యమైన మేరకు ఉదయం నుంచే సభకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు చేస్తున్నారు.
మరోసారి సత్తా
రజతోత్సవ సభను ఉమ్మడి జిల్లాలో పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా సభకు ఆయా గ్రామాల నుంచి ఎలా తరలి వెళ్లాలో రూట్మ్యాపులను సిద్ధం చేస్తూనే.. వాటిని పకడ్బందీగా అమలు చేయడానికి ఎక్కడికక్కడ పరిశీలకులను నియమించారు. ఇప్పటికే గ్రామాల వారీగా తరలి వచ్చే ప్రజలు, శ్రేణుల సంఖ్యకు అనుగుణంగా వాహనాలు, మంచినీటి సౌకర్యం వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు.
నిజానికి బీఆర్ఎస్కు ఉన్న సభ్యుల లెక్క ప్రకారం చూస్తే సుమారు ఆరు లక్షల మంది పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లా నుంచి తరలి వెళ్లే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి 7.50 లక్షల పైచిలుకు సభ్యత్వం ఉన్నది. అంటే సభ్యత్వం తీసుకున్న వారు వెళ్తే.. మరోసారి ఉమ్మడి జిల్లా తన ముద్ర వేసుకునే అవకాశముంటుంది. అలాంటింది ప్రతి పల్లె, వార్డు, డివిజన్ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా మీటింగ్‌కు తరలి వెళ్లేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి లక్షలాది మంది తరలివెళ్లనున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు వెనుదన్నుగా నిలువడమే కాదు, పూర్వవైభవం కల్పించడంలో కీలక భూమిక పోషించే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ మళ్లీ రావాలి.. బతుకులు బాగు పడాలి
జగిత్యాల, ఏప్రిల్ 24 : ‘రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలి. అందరి బతుకులు బాగుపడాలి. మా పింఛన్ 4 వేలు కావాలి’ అని బీడీ కార్మికులు ఆకాంక్షించారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో బీడీ కార్మికులను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పలుకరించగా, వారు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని మండిపడ్డారు. మహిళలకు ఇస్తానన్న ఏ ఒకహామీని ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని, ఏ ఒక వర్గం సంతోషంగా లేదని, మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయన్నారు.
తొలి ముఖ్యమత్రి కేసీఆర్, కవిత కృషితోనే తమకు పింఛన్ వచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ దారి ఖర్చుల కోసం 4 వేలను ఈ సందర్భంగా దావ వసంతకు అందజేశారు. అనంతరం దావ వసంత మాట్లాడుతూ, కేసీఆర్ వస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ శీలం ప్రియాంక, మాజీ కౌన్సిలర్ సంధ్య, నాయకులు గంగారెడ్డి, పెండెం గంగాధర్, ప్రశాంత్, వెంకట్ పాల్గొన్నారు.