కోల్ సిటీ, ఫిబ్రవరి 17: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమును ప్రపంచానికి చాటి చెప్పి.. ప్రత్యేక రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో సగౌరవంగా నిలబెట్టిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీరటి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున గోదావరిఖని (Godavarikhani) రమేష్ నగర్లో రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల మధ్య తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరిశుద్ధ కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
కేసీఆర్ హయాంలోనే పారిశుద్ధ్య కార్మికులకు ఎంతో గౌరవం దక్కిందని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలను ప్రజలు మర్చిపోయేలా డైవర్షన్ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోని ప్రజలకు విసుగు పుట్టిందని, రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తేనే బాగుంటుందని ఇప్పుడు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్, చిలకలపల్లి శ్రీనివాస్, కోడి రామకృష్ణ, అక్షర మల్లేష్, శ్రావణ్, తిరుపతి, శ్రీధర్ తో పాటు పారిశుద్ధ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.