Karimnagar Collector Pramela Satpathi | కార్పొరేషన్, జూన్ 25 : కరీంనగర్ నగరపాలక సంస్థ లోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ నగర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. నాళాల్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి వరద నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా చూడాలని అన్నారు.
చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేసే వారిపై నిఘా ఉంచి జరిమానా విధించాలని సూచించారు. అవసరమైన చోట పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, వాటి నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూడళ్ళలో అభివృద్ధి పనులు, డివైడర్ల నిర్మాణం, మొక్కల పెంపకం, వాటి నిర్వహణ వాటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. నగరంలోని పార్కులు, వాకింగ్ ట్రాక్స్ సమగ్ర నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజలు నడిచేందుకు ఏర్పాటుచేసిన ఫుట్ పాత్ లపై ఆక్రమణలు లేకుండా చూడాలని తెలిపారు.
కాంట్రాక్టర్లకు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా చెల్లింపులు జరగాలని అన్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల నుండి హెల్ప్ లైన్ నంబర్లకు వచ్చే సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి విభాగంలో ఫైళ్ల కదలికలో వేగం పెంచాలని, అధికారులు జవాబుదారితనంతో విధులు నిర్వహించాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ కాల పరిమితి ముగిసిన పలు నిర్వహణ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు.
నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్యకలాపాలు కొనసాగించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్సులు పొందని వారు సుమారు 9500 మంది ఉన్నట్లుగా సమాచారం ఉందని, వీరంతా ట్రేడ్ లైసెన్స్ పొందే విధంగా చూడాలని అన్నారు. నగరంలో ఎక్కడా అనధికార హోర్డింగ్ ఉండకూడదని అన్నారు. భవనాల నిర్మాణ సమయంలో మెటీరియల్ రోడ్ల పైన వేయకుండా చూడాలని తెలిపారు.
అనుమతి లేకుండా రోడ్లను కటింగ్ చేస్తే జరిమానా విధించాలని అన్నారు. నివాసయోగ్యమైన భవనాలకు అనుమతి పొంది వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగిస్తే వాటిని కమర్షియల్ గా మార్చాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహినుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ సువార్త, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు యాదగిరి, సంజీవ్ పాల్గొన్నారు.