Karimnagar | కమాన్ చౌరస్తా, జనవరి 24 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లోడ్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అంక రార్పణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం పాతబజార్ గౌరీశంకరాలయంలో మృత్సంగ్రహణం (పుట్టమన్ను తెచ్చుట) నిర్వహించారు. శోభాయాత్రగా పుట్టమన్ను ఆలయానికి తీసుకవచ్చారు. సాయంత్రం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం జరిగాయి. రాత్రి శ్రీవారు శేషవాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ కనువిందు చేశారు.
శ్రీవారిని భక్తులు దర్శించి పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ నాయిని సుప్రియ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కందుల సుధాకర్, పాత బజాజ్ శివాలయం ఈవో ఉడుతల వెంకన్న, వివిధ ఆలయాల ఈఓలు, సిబ్బంది, నాయకులు, వివిధ సంస్థల కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. సాంస్కృతిక కళావేదికపై గాయకుడు, ఉత్సవాల కల్చరల్ ఆర్గనైజర్, గోగుల ఈవెంట్స్ నిర్వాహకుడు గోగుల ప్రసాద్ నేతృత్వంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు అలరిం చాయి.