Jagityal | జగిత్యాల, జూన్ 11: ఇందిరమ్మ పథకంలో వచ్చిన భూమిని సాగు చేసుకోనివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ గుట్రాజపల్లికి చెందిన రైతు కల్లేపల్లి గంగయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుడు గురువారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం అనంతరం గ్రామ శివారులోని సర్వే నెం. 439/12లో 33 గుంటల భూమి 20 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ భూ పంపిణీ ద్వారా తనకు లభించిందని, అప్పటి నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని పేర్కొన్నారు. అట్టి భూమిని సాగుకు అనుకూలంగా చేసి అందులో బావి తవ్వి, కరెంట్ మోటార్ పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు.
అయితే అదే గ్రామానికి చెందిన కల్లేపల్లి అచ్చయ్య, గంగాధర్, నరేష్, రాజేశం, దేవదాస్ తదితరులు తనకు ప్రభుత్వం భూమి ఇచ్చిందని జిర్ణించుకోలేక అట్టి భూమిని సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒక రాజకీయ నాయకుడి అండతో తనను బెదిరిస్తున్నారని, ‘పొలం దగ్గరే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని’ ఆయన వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా సాగు చేసుకునేoదుకు అధికారులు సహకరించాలని గంగయ్య కలెక్టర్ ను కోరారు. గతంలో రెండుసార్లు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుతం తనకు ప్రాణభయం ఉందని గంగయ్య తెలిపారు. అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. తన భూమిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునేలా అధికారులు సహకరించాలని గంగయ్య కోరారు. ఈ విషయమై కలెక్టరేట్ అడ్మిన్ స్ట్రేషన్ అధికారి ద్వారా జగిత్యాల రూరల్ తహసీల్దార్ కు ఫైల్ చేరినట్లు సమాచారం.