సిటీబ్యూరో/రవీంద్రభారతి: ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ చలాన్ల భారం తగ్గించడంతో పాటు డ్రైవర్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేయాలన్నారు.
ఆటో మీటర్ చార్జీలను సవరించాలన్నారు. డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టే ప్రతి ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. డైవర్ల జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే 23న అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్ల నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం. హన్మేష్, ఆటో జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, ఎస్.దయానంద్, పెంటయ్య, ఓమర్ ఖాన్, ముఖేశ్, రవిశంకర్ పాల్గొన్నారు.