దసరా ఉత్సవాలపై కాంగ్రెస్ ఆంక్షలు విధిస్తున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్క్ఫెడ్ మైదానంలో రాంలీలా నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తున్నది. రాంనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొన్నేండ్లుగా వేడుకలు జరుపుతుండగా, ఎన్నడూ లేనివిధంగా ఈ సారి అనుమతుల పేరిట గ్రౌండ్ గేటుకు తాళం
వేయడంపై బీఆర్ఎస్ దళం భగ్గుమన్నది. అయితే ఓ మంత్రి కావాలనే ఇబ్బందులు తెస్తున్నారని మండిపడుతున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 30: కరీంనగర్లోని మార్క్ఫెడ్ గ్రౌండ్లో రాంనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏటా దసరా రోజు రాంలీలా నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సారి దసరా వేడుకలను తామే నిర్వహిస్తామంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొనడంతో వివాదం
మొదలైంది. ఏండ్ల తరబడి నిర్వహిస్తున్న స్థానిక యువకులను కాదని అధికార పార్టీ నేతలు నిర్వహిస్తామని పేర్కొనడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉత్సవ కమిటీ వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని ఓ మంత్రి కక్షగట్టి, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆంక్షలు తెచ్చారనే
విమర్శలున్నాయి. అయితే రాంలీలా కోసం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా ఏర్పాట్లు జరుగుతుండగా, ఉత్సవాలకు మార్క్ఫెడ్ నుంచి అనుమతులు తీసుకోవాలంటూ అధికారులు తాజాగా గ్రౌండ్ గేటుకు తాళం వేయడంతో బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు.
మంగళవారం సాయంత్రం గేటు వద్ద ఆందోళన చేశారు. ఉత్సవాలను అడ్డుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం స్పందించి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకునేందుకు గేటు తెరవాలంటూ డిమాండ్ చేశారు. ఈ
సందర్భంగా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ, దసరా ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్క్ఫెడ్ గ్రౌండ్లో రావణ దహనానికి అనుమతులు తీసుకోవాలని చెప్పడం వింతగా ఉందని దుయ్యబట్టారు. కేవలం మంత్రుల ఒత్తిళ్లతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
వేలాది మంది తరలివచ్చే కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికే ఈ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి పొన్నం, కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే గంగుల ఫొటోలు ఉన్నాయని, ఇలా కక్ష సాధింపులకు దిగడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఉత్సవాలకు
మంత్రులు వస్తే స్వాగతిస్తామని చెప్పారు. ఏళ్ల తరబడిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్థానిక యువతను కాదని కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పడం సరికాదన్నారు.
ఉత్సవాల నిర్వహణ కోసం కొన్ని రోజులుగా పనులు సాగుతుంటే స్పందించని అధికారులు, ఈ రోజు గేటు తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. పనులు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే గేటు తెరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆందోళనలో
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఐలేందర్, ఎవీ రమణ, బీఆర్ఎస్ నాయకులు రెడ్డవేణి మధు, తిరుపతినాయక్, పవన్, కర్ర సూర్యశేఖర్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.