Nutritious food | కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 24 : భావిభారత చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు వారికి పోషకాహారం అందించేందుకు అపసోపాలు పడుతున్నారు. పారదర్శకతతో పాటు చిన్నారుల వివరాలు, వారికందిస్తున్న ఆహారం, ఇతరత్రా సమాచారం ఎప్పటికప్పుడు అందజేసేందుకు అంగన్వాడీ టీవర్లకిచ్చిన స్మార్ట్ ఫోన్లు సతాయిస్తున్నాయి.
క్షణాల్లో యాప్‌లో అప్లోడ్ కావాల్సిన వివరాలు నిమిషాలు గడిచినా పూర్తి కావటం లేదు. దీంతో, ఒక్కొక్కరి వివరాల నమోదుకు కనీసం పావుగంటకు పైగా సమయం తీసుకుంటోంది. కాగా, ఇటు వారికి బోధించలేక, అటు వివరాలు నమోదు చేయలేక అష్టకష్టాలు పడుతున్నామని అంగన్ వాడీ టీచర్లు అవేదన వెలిబుచ్చుతున్నారు. అంగన్ వాడీ టీచర్ల సంఘం నాయకురాలు వరలక్ష్మి యాప్‌లో లో నమోదు చేయటంలో జరుగుతున్న జాప్యంతో పడుతున్న ఇబ్బందులపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్ళగా, సత్వరమే కొత్త స్మార్ట్ ఫోన్లు అందజేయాలని సంబంధిత శాఖ కమిషనర్‌ను ఈ ఏడాది జూన్‌లో ఆదేశించారు. అయితే, ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అధికారులు కొత్త ఫోన్లు కొనుగోలు చేయలేదు. తమ బాధలు తగ్గలేదని టీచర్లు వాపోతున్నారు. నిత్యం ఉదయం కేంద్రానికి వచ్చిన చిన్నారుల వివరాలు ముందుగా యాప్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అనంతరం మధ్యాహ్నం భోజన సమయంలో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించే వివరాలతో పాటు, వారి ఫోటోలు కూడా తీయటంతో పాటు, ఏ రోజుకారోజు లబ్ధిదారుల వివరాలు, కొత్తగా నమోదయ్యే వారి వివరాలు, ఆహార సామాగ్రి విలువ, లబ్ధిదారుల వాక్సినేషన్, కుటుంబ సర్వేతో పాటు ఇతరత్రా వివరాలు కూడా రోజు వారీగా యాప్ లో నమోదు చేయాలి. మధ్యాహ్నం పౌష్టికాహారం తీసుకునేందుకు వస్తున్న లబ్దిదారుల్లో వచ్చే గర్భిణులు, బాలింతలుచ పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులు ఎంతమంది పౌష్టికాహారం తీసుకున్నారనే వివరాలు కూడా పొందుపరిచి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అయితే, గతంలో ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు సాధారణ సాంకేతిక పరిజ్ఞానం కలిగినవే కావటంతో, మారుతున్న సాంకేతికతకు అనుకూలంగా లేకపోవటంతో సమస్యలు వస్తున్నాయని అంగన్ వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. జిల్లాలో 777 కేంద్రాలుండగా, వీటిలో 723 మంది టీచర్లు పనిచేస్తున్నారు. మిగతా 54 కేంద్రాల్లో టీచర్లు లేకపోవటం, ఆయాలకు వాటిని వినియోగించే సామర్థ్యం లేక వాటిని అధికారులు, సిబ్బంది వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఐదేళ్ళ క్రితం స్మార్టు ఫోన్లు అందజేయగా, ఇంకా వాటినే కొనసాగిస్తుండగా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి.
తాజాగా ప్రస్తుతం కొనసాగిస్తున్న యాప్‌కు బదులు కొత్తగా మరో యాప్‌ను తెస్తుండగా, అందులో చిన్నారుల చిత్రాలతో పాటు వీడియో కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని సంబంధిత కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న తమకు కనీసం ప్రభుత్వం సరైన సాంకేతిక సామాగ్రి కూడా అందించకుండా తమ ఆరోగ్యాలతో చెదాగాటమాడుతుందని మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే కొత్త స్మార్ట్ ఫోన్లు అందజేసి, నిబంధనల మేరకు మాత్రమే విధులు అప్పగించాలని అంగన్వాడీ టీచర్లు కోరుతున్నారు.