ఎన్టీపీసీ యాష్ రవాణాలో మరో దందా కలకలం రేపుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్లడమే కాదు, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ రూ. లక్షలు కొల్లగొడుతున్నట్టు వెలుగులోకి వస్తున్నది. ఒక్కో లారీకి 50వేల రవాణా చార్జీలు భరించి మరి సంస్థ ఖమ్మం నేషనల్ హైవేకు ఉచితంగా సరఫరా చేస్తుండగా, ఇదే అదునుగా కొంత మంది పక్కదారి పట్టిస్తున్నట్టు సమాచారం అందుతున్నది. 40శాతం లారీలను బ్లాక్‌కు తరలించి, ఒక్కో బూడిద లారీ లోడ్ కెపాసిటీని బట్టి 30వేల నుంచి 50వేల వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ బాగోతంలో స్థానిక నాయకులు, అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. దందాను పట్టించుకునే వారు లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
పెద్దపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఆధారిత ప్రాజెక్టు అయిన ఎన్టీసీసీలో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద అంతర్గాం మండలం కుందన్‌పల్లి బూడిద చెరువులోకి చేరుతుంది. పైప్‌లైన్ ద్వారా ప్రతి రోజూ 11వేల మెట్రిక్ టన్నులు వస్తున్నది. చెరువులో బూడిద నిల్వలు పేరుకుపోతే కాలుష్యనియంత్రణ మండలి ఒక్కో టన్నుకు వెయ్యి వరకు జరిమానా విధిస్తున్నది. దీంతో ఆ భారాన్ని తప్పించుకునేందుకు యాజమాన్యం కొన్నేళ్లుగా బూడిదను ఫ్రీగా అందజేస్తున్నది. ఖాళీ చేసేందుకు అవసరమైన రవాణా చార్జీలను సంస్థనే భరిస్తున్నది. నేషనల్ హైవేల నిర్మాణానికి వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడంతో ఉచితంగా సరఫరా చేస్తున్నది. పని ప్రదేశాలకు తరలించేందుకు అవసరమైన రవాణా చార్జీలను చెల్లిస్తున్నది. అయితే ఇదే అదునుగా కొంత మంది దందాకు తెరతీసినట్టు తెలుస్తున్నది.
బూడిద తరలింపు కోసం ఎన్టీపీసీ ఏడాది కింద టెండర్లను పిలువగా, ఓ కంపెనీ పూర్తి స్థాయి అనుమతులను దక్కించుకున్నది. ఆ తర్వాత ఆ కంపెనీ భాగస్వామ్యంతో మరో ఐదు కంపెనీలు సబ్ లీజ్ తీసుకున్నాయి. అయితే ఇక్కడ జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి బూడిదను ఇవ్వడంతోపాటు దానిని ఖమ్మం నేషనల్ హైవే నిర్మాణం కోసం తరలించేందుకు ఎన్టీపీసీ రవాణా చార్జీలుగా ఒక్కో టన్నుకు 1250 చొప్పున అంటే ఒక్కో లారీకి దాదాపుగా 50వేల వరకూ చెల్లిస్తున్నది. గతేడాది మార్చి నుంచి ఈ బూడిద రవాణా కొనసాగుతున్నది. ప్రతిరోజూ దాదాపుగా 400 నుంచి 500 వరకు లారీలు ఇక్కడి నుంచి ఖమ్మం నేషనల్ హైవే నిర్మాణానికి బూడిదను తరలిస్తున్నాయి. అందుకు గానూ అనుమతులు దక్కించుకున్న కంపెనీలు వేబిల్లులను ఇస్తున్నాయి. అయితే ప్రతి రోజూ వచ్చే లారీల్లో దాదాపుగా 60శాతం మాత్రమే కుందన్‌పల్లి టూ ఖమ్మం నేషనల్ హైవేకు చేరుతుండగా, మిగతా 40శాతం లారీలు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్ధిపేట జిల్లాకు తీసుకువెళ్లి విక్రయిస్తూ.. ఎన్టీపీసీ రవాణా చార్జీలు 50వేల వరకు, బ్లాక్‌లో విక్రయించడం ద్వారా మరో 50వేల వరకు కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి.
బూడిద కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక నాయకులకు వాటాలు ముడుతున్నట్టు తెలుస్తుండగా, ఒక్కో ఓవర్ లోడ్ బూడిద లారీకి 8వేల వరకు అధికారులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు ఖమ్మం వెళ్లకుండా బ్లాక్‌లో విక్రయించే బూడిద లారీ ఎక్కడ దొరికినా అక్కడ వేలల్లో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో మిగిలిన లారీ యజమానులు సైతం ఒక్కో లారీకి నెలకు 8వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఇటీవల బసంత్‌నగర్‌కు చెందిన ఓ లారీ యజమాని అనిల్‌గౌడ్ పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇదంతా కండ్ల ముందే జరుగుతున్నా అటు పాలకులు గాని, అధికారులు గాని చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సెంట్రల్ విజిలెన్స్ దృష్టి సారించాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి.
ఎన్టీపీసీలో లారీలు బ్లాక్ మార్కెట్లో విక్రయించడం వెనుక కొందరు సెక్యూరిటీ అధికారులపైనా ఆరోపణలు వస్తున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డుకు ముందు, తర్వాత లారీల నంబరు ప్లేట్లు మార్చడం, జీపీఎస్‌ను మరో లారీలో పెట్టడం, ఒకే నంబర్‌పై ఒకే రోజు మూడు నాలుగు లారీలు తిప్పుతున్నట్టు తెలుస్తున్నది. ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణానికి ఇక్కడి నుంచి వెళ్లిన 500 లారీల్లో 250వరకు మాత్రమే చేరుతున్నట్టు తెలుస్తున్నది. హైవే అథారిటీ వారికి అనుమానం రాకుండా లారీల్లో స్థానిక మట్టిని, అక్కడి స్థానిక బూడిదను కలిపి రికార్డ్స్‌లో ఎక్కించి దోచుకుంటున్నట్టు తెలుస్తున్నది.