RTI | కోల్ సిటీ, సెప్టెంబర్ 29 : రామగుండం నగర పాలక సంస్థకు సంబంధించి సమాచారం కోరుతూ ఆర్టీఐ చట్టం-2005 కింద సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ దాఖలు చేసిన అప్పీల్‌కు తెలంగాణ సమాచార కమిషన్ స్పందించింది. ఈమేరకు విచారణకు హాజరుకావాలని ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా దరఖాస్తు దారుడు మద్దెల దినేష్ మాట్లాడుతూ కేసు నం.10234/ఎస్ఐసీ-డీబీ/2026కు సంబంధించి సమాచార కమిషన్ నోటీసు జారీ చేసిందని, ప్రతిపాదిగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ను చేర్చారని తెలిపారు. అక్టోబర్ 3న హైదరాబాద్ లోని తెలంగాణ సమాచార కమిషన్ ఎదుట విచారణ జరగనుందని తెలిపారు.
ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా అందించేందుకు ఆర్టీఐ చట్టం కల్పించిన హక్కును సమర్ధవంతంగా వినియోగించుకుంటామని, కమిషన్ విచారణలో సంబంధిత అంశాలను ఆధారాలతో సమర్పిస్తామని తెలిపారు. ప్రధానంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తోపాటు ఇతర సిబ్బంది అధికారులుగా కాకుండా అధికార పార్టీ నేతలుగా వ్యవహరిస్తున్నారని, రామగుండం కార్పొరేషన్ లో తీవ్రంగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు. కమిషన్ ఆదేశానుసారం పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించనున్నట్లు తెలిపారు. కాగా, ఈ నోటీసు అంశం రామగుండం కార్పొరేషన్ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.