రాజకీయ కక్షకు ఓ ఇద్దరు మండల విద్యాధికారులు బలవ్వాల్సి వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాశాఖ చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఆ ఇద్దరు ఎంఈవోలకు ఆగమేఘాల మీద నోటీసులు ఇవ్వడమే కాకుండా.. సంజాయిషీని కూడా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా రిటేన్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతున్నది. ఎమ్మెల్యే సమీక్షా సమావేశాలకు హాజరైనందుకు చర్యలు తీసుకోవడం, ఈవిషయంలో కరీంనగర్ జిల్లా విద్యాధికారి వ్యవహరించిన తీరు సర్వత్రాచర్చనీయాంశమవుతున్నది.
కరీంనగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతిధి) : హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న అసౌకర్యాలు, కావాల్సిన అవసరాలు, విద్యార్థుల భవిష్యత్ వంటి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 15న హుజూరాబాద్‌లోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి సైదాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్ మండలాల ఎంఈవోగా కొనసాగుతున్న కే నరసింహరెడ్డి, అలాగే వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు మండల విద్యాధికారిగా కొనసాగుతున్న వీ శ్రీనివాస్ హాజరయ్యారు.
వీరితోపాటు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తేవాలని, ప్రధానంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో హెచ్ఎంలు పాఠశాలల వారీగా పలు సమస్యలను దృష్టికి తేగా.. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. నిజానికి నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు సమీక్షలు పెట్టడం, సమస్యలు పరిష్కరించుకోవడం అనాదిగా వస్తున్నదే. అదే పద్ధతిని కౌశిక్‌రెడ్డి కొనసాగించారు.
సమీక్షకు మండల విద్యాధికారులు హాజరవ్వడమే కాకుండా.. హెచ్ఎంలను తీసుకెళ్లారని, ఎమ్మెల్యే సమీక్షా సమావేశానికి ఎలా వెళ్తారంటూ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ కరీంనగర్ జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ప్రణవ్ బాబు ఫిర్యాదు చేసినట్టు స్వయంగా డీఈవో జారీ చేసిన నోటీసులోనే స్పష్టం చేశారు. అంతేకాదు, ఆ ఫిర్యాదుపై వివరణ ఇవ్వడంతోపాటు ప్రధానోపాధ్యాయులను ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలంటూ సదరు నోటీసులో పేర్కొన్నారు.
ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే సమీక్షకు హాజరైన మీపై చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటూ ఇద్దరు మండల విద్యాధికారులకు నోటీసులు ఇచ్చారు. అందుకు సంబంధించిన నోటీస్ ఈ నెల 21న జారీ చేశారు. ఆ మేరకు కారణాలను వివరిస్తూ ఎంఈవోలు వివరణ ఇచ్చారు. కానీ, అవేవి పట్టించుకోకుండా సదరు మండల విద్యాధికారులను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ.. వారి వారి పాఠశాలలకు రిటేన్ చేశారు. వీరి స్థానంలో కొత్తవారికి ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ ఇచ్చారు.
సాధారణంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. విద్యకు సంబంధించి మా త్రమేకాదు, అన్ని శాఖల అధికారులతో స మీక్షలు పెడుతారు. ఎమ్మెల్యేల పిలుపు మే రకు.. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు వెళ్లడం సర్వ సాధారణం. ఇది అనాదిగా వస్తున్నదే. ఇదే కోవలో హు జూరాబాద్ మండల విద్యాధికారులు వె ళ్లారు. కానీ, ఈ విషయంలో ఏదో తప్పు జరిగినట్టుగా విద్యాశాఖ అధికారి వ్యవహరించిన తీరు ప్రస్తుతం విమర్శలకు తావిమస్తున్నది.
కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా విద్యశాఖ అంత ఆగమేఘాల మీద ఎందుకు స్పందించిందో అర్థంకాని విషయమే. ఒకవేళ స్పందించినా వాస్తవాలు తెలుసుకోవాలి. సమీక్షలో ఏం జరిగిందో గుర్తించాలి. లేదా ఒక విచారణ అధికారిని వేసి వివరాలు తీసుకోవాలి. కానీ, ఇవేవి లేకుండానే సదరు అధికారులను రిటేన్ ఎలా చేస్తారన్న ప్రశ్నలు విద్యాశాఖలో ఉత్పన్నమవుతున్నాయి.