జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా భ్రూణహత్యల రాకెట్ నడుస్తున్నది. ఇన్నాళ్ల్లూ కేవలం మూడు జిల్లాలకే పరిమితం అనుకున్న ఈ దందా, ఏకంగా మూడు రాష్ర్టాలకు పాకినట్టు సమాచారం అందుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో సంచలనం రేగుతుండగా.. తీగలాగితే డొంకంతా కదులుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా పని చేస్తున్న ఓ ఆర్ఎంపీ ఏజెంట్‌గా అవతారం ఎత్తి, ఈ వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తున్నది. మూడు రాష్ర్టాల్లోని ఆర్ఎంపీలతో సంబంధాలు పెట్టుకొని.. ఇక్కడ అబార్షన్లు చేయిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలోనే డబ్బులు చేతులు మారుతున్నా.. ఈ కేంద్రాలకు మూడు రాష్ర్టాల నుంచి గర్భిణులు వచ్చి వెళ్తున్నా పోలీసుల పర్యవేక్షణ ఏమైందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు భ్రూణహత్యల విషయంలో జిల్లా వైద్యారోగ్యశాఖ చోద్యం, జిల్లా వైద్యాధికారి సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న భ్రూణహత్యలపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు సంచలనం రేపుతున్నాయి. మంగళవారం ‘చిదిమేసింది ఎవరు?’, బుధవారం ‘భ్రూణ హత్యలపై కదిలిన యంత్రాంగం’ శీర్షికన ప్రచురితమైన కథనాలు ఉమ్మడి జిల్లా వైద్యరంగంలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాల్లో హాట్‌టాపిక్ అయ్యాయి. దీనిపై ఇప్పటికే హుస్నాబాద్ పోలీసులు, ఒక అడుగు ముందుకేసి కూపీలాగడంతోపాటు కొంత మందిని అరెస్ట్ చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో మరింత ముందుకెళ్తున్నారు. ఇటు ‘నమస్తే తెలంగాణ’ లోతుగా సేకరించిన వివరాల ప్రకారం చూస్తే.. ఈ వ్యవహారం వెనుక పెద్ద ముఠానే పని చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో పెద్ద రాకెట్లా విస్తరించినట్టు స్పష్టమవుతున్నది.

సాధారణంగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వారికి అబార్షన్లు చేస్తున్నట్టు ఇన్నాళ్లు భావించినా, దీనిని మరింత లోతుగా చూస్తే మూడు జిల్లాలు కాదు.. ఈ రాకెట్ ఏకంగా మూడు రాష్ర్టాలకు పాకినట్టు సమాచారం అందుతున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ అబార్షన్లు చేస్తుండగా, దీని వెనుక పెద్ద ముఠానే పని చేస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఓ ఆర్ఎంపీ ఏజెంట్ అవతారం ఎత్తి ఈ దందాలో కీలక సూత్రదారిగా వ్యవహరిస్తున్నాడు. తన నెట్‌వర్క్‌ను మూడు రాష్ర్టాలకు విస్తరించాడు. ఆయా ప్రాంతాల్లో ఉండే ఆర్ఎంపీలకు అన్ని విషయాలు తెలిసే అవకాశముండడంతో వారికే ఎరవేసి, సంబంధాలు కొనసాగిస్తున్నాడు. వారు సూచించే కేసులను జమ్మికుంట, హుజూరాబాద్‌కు తీసుకొచ్చి, అబార్షన్లు చేయిస్తున్నట్టు సమాచారం. తీసుకొచ్చిన వారికి వాటా ముందుగానే ఇవ్వడం, ఆ తర్వాత దవాఖాన వర్గాలకు ముట్టజెప్పడంతోపాటు ఆయన సైతం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. అయితే గుట్టుచప్పుడు కాకుండా దందా నడస్తుండడంతో కొంత మంది ఈ ఏజెంట్‌ను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే అదునుగా డబ్బులు దండుకోవడంతోపాటు దర్జాగా అబార్షన్ల రాకెట్ నడుపుతున్నట్టు సమాచారం.
హుజూరాబాద్ కేంద్రంగా ఓ దవాఖానలో జరిగిన అబార్షన్ గురించి స్వయంగా ఓ యువతి ఫిర్యాదు చేయడం, హుస్నాబాద్ పోలీసులు ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేశారు. నిందితుల సమాచారంతో మరికొంత మందిపై చర్యలు తీసుకోవడానికి ముందుకు సాగుతున్నారు. ఈ దందా జరుగుతున్న తీరును వరుస కథనాలతో ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. అయితే జమ్మికుంట ఆ తర్వాత హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న భ్రూణహత్యల అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ తమకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. భ్రూణహత్యల విషయంలో యువతి ఫిర్యాదు, కేసు నమోదు, అరెస్ట్ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ బుధవారం జిల్లా వైద్యాధికారి (డీహెచ్ఎంవో) సుజాత దృష్టికి తీసుకెళ్లి, ఏమి చర్యలు తీసుకుంటున్నారని వివరణ కోరగా.. సదరు అధికారి వింత సమాధానాలు చెప్పారు. తమకు ఆ విషయంపై ఫిర్యాదు అందలేదని, అందితే తమ బృందాలను పంపిస్తామన్నారు. అయితే రెండురోజులుగా పత్రికలో వస్తున్న కథనాలు చూస్తున్నామని చెప్పారు. కథనాలు చూసినప్పుడు భ్రూణహత్యలకు పాల్పడుతున్నట్టు నిర్ధారణ అయిన దవాఖానకు మీరు ఏమైనా నోటీసు జారీ చేసి వివరణ కోరారా..? అన్న ప్రశ్నకు.. తమకు ఫిర్యాదు రాకపోవడంతో మేం ఏమీ చేయలేదన్నారు. మరోసారి కేసు హుస్నాబాద్‌లో అయింది కదా? అన్నారు. కానీ, అబార్షన్ అయింది మీ పరిధిలోని దవాఖానలోనే కదా? అంటే.. ఆమె సమాధానం దాట వేశారు. మరోసారి పోలీసులు తమకు సమాచారం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తుంటే వైద్యారోగ్యశాఖ నిద్రపోతున్నట్టు కనిపిస్తున్నది.
నిజానికి భ్రూణహత్యలు జరిగినట్టుగా ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా జిల్లా వైద్యారోగ్యశాఖ సుమోటోగా తీసుకొని, తక్షణం బృందాలను రంగంలోకి దింపాలి. సదరు దవాఖానకు వెళ్లి సిబ్బందిని విచారించాలి. నిజాలు నిర్ధారించుకొని తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ, అవేవి వైద్యారోగ్యశాఖలో కనిపించడం లేదు. నిజానికి ఈ విషయాన్ని డీహెచ్ఎంవో సీరియస్‌గా తీసుకోవాలి. ఆమె పరిధిలోని జిల్లాలోనే భ్రూణహత్య జరిగిందంటూ యువతి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పుడు.. ఆ సమాచారం సదరు పోలీస్‌స్టేషన్ నుంచి తెప్పించుకోవాలి. సదరు దవాఖానలపై చర్యలు తీసుకోవాలి. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న భ్రూణహత్యల వ్యవహారం మూడు రాష్ర్టాలకు విస్తరించడం, అక్కడి గర్భిణులను తీసుకొచ్చి ఇక్కడ అబార్షన్లు చేయిస్తున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు పర్యవేక్షణ సైతం ఏమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై స్థానిక పోలీసులు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు జయశంకర్ భూపాలపల్లికి చెందిన ఏజెంట్ నడుపుతున్న దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.