Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 11: రామగుండం కార్పొరేషన్ లో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతుందని కాగితాలు చూపించడం కాదనీ, ఆ చిత్తశుద్ధి ఉంటే ముందు కౌన్సిల్ మీటింగ్ కు రావాలని రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ సవాల్ విసిరారు. పాలక వర్గం కొలువుదీరిన మొదట్లో జరిగిన కౌన్సిల్ సమావేశం ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రెండో దఫా జరగలేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన నగర పాలక కార్యాలయంలో అదనపు కలెక్టర్, కమిషనర్ జే అరుణశ్రీని కలిసి కౌన్సిల్ సమావేశాల నిర్వహణపై చర్చించి వినతి పత్రం అందజేశారు. అనంతరం సమ్మయ్య మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రతీ నెల కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలంటూ నీతి వాఖ్యాలు మాట్లాడి ఇప్పుడు తమదాకా వచ్చేసరికి ఆ నిబంధనలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. 60 డివిజన్లలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని, ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం లేక పాలక వర్గం నవ్వుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాతీర్పుతో గెలిచిన కార్పొరేటర్లంటే అధికారులకు లెక్క లేకుండా పోయిందని, కనీసం కౌన్సిల్ మీటింగ్ నిర్వహించే తీరిక లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రతీ నెల క్రమం తప్పకుండా కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్ పై ఉందన్నారు. కానీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రతీ డివిజన్ లో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డివిజన్లలో రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు సక్రమంగా లేవనీ, ప్రజా సమస్యల పరిష్కారంకు, అభివృద్ధి పనుల మంజూరుకు కౌన్సిల్ సమావేశమే వేదిక అని గుర్తు చేశారు. మొదటి కౌన్సిల్ మీటింగ్ లో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారమయ్యాయా లేవా? అని ప్రశ్నించారు. రామగుండంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తే తామడిగే ప్రశ్నలకు బదులు చెప్పలేక భయపడే మీటింగ్ లకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని రామగుండం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట 6వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు తోకల రమేష్ ఉన్నారు.