Urea | కోరుట్ల, ఆగస్టు 14: రైతన్నకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. పంటలకు సరిపడా యూరియా అందకా అవస్థలు పడుతున్నారు. అనుకున్న సమయానికి యూరియా దొరక్క ప్రైవేట్లో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి యూరియా కొనుగోలు చేసి పంటలు కాపాడుకుంటున్నారు. కోరుట్ల మండలంలోని అయిలాపూర్, మోహన్రావు పేట గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో గురువారం రైతులకు యూరియాను అందజేశారు. అయిలాపూర్లో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి పడిగాపులు పడ్డారు.
తీరా ఉదయం 11 గంటలకు పీఏసీఎస్ గోదాం తెరిచిన అధికారులు ముందుగా రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. అప్పటికే రైతులు తమకు యూరియా దొరకదేమోనని ఎగబడ్డారు. ఎకరాకు ఒక బస్తా చొప్పున మాత్రమే అందిస్తున్నట్లు రైతులు వాపోయారు. అయిలాపూర్ సహకార సంఘానికి 900 యూరియా బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందరికి యూరియా పంపిణీ చేస్తామని ఆందోళన చెందవద్దని వారించారు.
చిన్నమెట్పల్లి సహకార సంఘం అనుబంధ గ్రామం మోహన్రావుపేటలో రైతులు యూరియా వచ్చిందని తెలిసి తమ పాస్ బుక్కులు, ఆధార్ కార్డులను లైన్లో ఉంచారు. చాలీచాలనీ యూరియా అందిస్తున్నారని మండి పడ్డారు. ‘మోహన్రావు పేట గ్రామ రైతులకు 340 బస్తాల యూరియా సరఫరా కాగా పేర్లు ఆన్లైన్లో నమోదు చేసి వరుస క్రమంలో యూరియాను పంపిణీ చేశారు.
లైన్లో ఉన్నోళ్లకు యూరియా ఇస్తలేరు.. : వల్లపు శంకర్, రైతు, తిమ్మాయిపల్లి
ఉదయం నుంచి లైన్లో ఉన్న రైతులకు యూరియా ఇస్తలేరు. యూరియా లోడ్ రాగానే కొంతమంది రైతులు తమ పలుకుబడితో 10 బస్తాల వరకు యూరియాను తీసుకుపోతున్నారు. నేను మొక్కజోన్న పంట, వరి వేశాను. ఇచ్చిన రెండు బస్తాల యూరియా మక్క పంటకే సరిపోయింది. ఇప్పటి వరకు వరికి యూరియా చల్లలేదు. పంట కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలుస్తలేదు. అధికారులు వరుస క్రమంలో ప్రతి రైతుకు యూరియా బస్తాలు అందేలా చర్యలు తీసుకోవాలి.