Ramagundam Baldiya | కోల్ సిటీ, అక్టోబర్ 10: గోదావరిఖనిలో కూల్చివేతల ఘట్టం కొనసాగుతోంది. రోడ్ల విస్తరణ, అభివృద్ధి పేరిట రామగుండం నగర పాలక సంస్థ మళ్లీ కూల్చివేత చర్యలకు నడుం బిగించింది. రెండు రోజుల క్రితం స్థానిక లక్ష్మీనగర్ లో గల మొబైల్ షాపులు, హోటళ్లను తొలగించిన రామగుండం నగర పాలక సంస్థ శుక్రవారం ఆపరేషన్ కాలేజీ గ్రౌండ్ కు ఉపక్రమించింది. రాజేష్ థియేటర్ జంక్షన్ ప్రక్కన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఆనుకొని ఉన్న టూ వీలర్ మెకానిక్ షెడ్లు, ఇతర దుకాణాలను పూర్తిగా తొలగించింది.
పక్షం రోజుల కిందట షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన నగర పాలక సంస్థ శుక్రవారం ఉదయం జేసీబీతో చేరుకొని ఒక్కసారిగా దుకాణాలను నేలమట్టం చేసింది. ప్రధాన రోడ్డుకు పుట్ పాత్ కు అవతలి వైపు ఉన్నప్పటికీ దుకాణాలు కూల్చివేయడం పట్ల యేళ్ల తరబడి వాటినే నమ్ముకొని జీవిస్తున్న మెకానిక్ లు ఒక్కసారిగా జీవనోపాధి కోల్పోవలసి వచ్చింది. ఒకవైపు కూల్చివేతలు జరుగుతుండగానే మరోవైపు పక్క దుకాణాల్లోని వారు తమ సామగ్రిని సర్దుకొని వెళ్లిపోయారు.
మధ్యాహ్నం వరకు పూర్తిగా అన్ని దుకాణాలను కూల్చివేశారు. కూల్చివేతల పర్వం మళ్లీ వేగవంతం కావడంతో తదుపరి చర్యలు ఎక్కడ ఉంటాయోనని నగరంలో సర్వత్ర చర్చ జరుగుతోంది. స్థానిక మార్కండేయ కాలనీలో సైతం రోడ్ల విస్తరణలో భాగంగా త్వరలోనే కూల్చివేతలు జరగనున్నట్లు సమాచారం. స్థానిక వంక బెండ్ నుంచి జీఎం కాలనీకి వెళ్లే గాంధీనగర్ ఏరియాలో రోడ్ల ప్రక్కన గల నివాస గృహాలకు సైతం నగర పాలక సంస్థ ఇటీవలనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది.