Urea App | వీణవంక, ఫిబ్రవరి 21: యూరియా యాప్లో వద్దని.. దుకాణాల్లోనే అందజేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు చల్లూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం చేతకానితనానికి రైతులు పనులు మానుకొని యూరియా కోసం బారులు తీరుతున్నామని, యూరియా యాప్ పై అవగాహన లేక యూరియా కొరతతో పంటలు సన్నగిల్లు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని కొరత ఇప్పుడెలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
చల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా వచ్చిందని శుక్రవారం బుక్ చేసుకోవాలని సూచించారు. బుక్ చేసుకున్నాక శనివారం ఉదయం 8గంటలకి ఇస్తామన్నారు. తీరా 8గంటలలోపే 350 బస్తాలు అయిపోయాయని అధికారులు రైతులకు చెప్పారు. దీంతో రైతులు జమ్మికుంట కరీంనగర్ ప్రధాన రహదారి పై సుమారు గంటపాటు ధర్నా నిర్వహించి వాహనాలు నిలిపేశారు.
యూరియా బుక్ చేసుకున్న రైతులు షాపు ముందు గంటల తరబడి నిలబడినా ఇచ్చేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సంబందిత అధికారులనుండి ఎలాంటి స్పందన లేకపోవడం అధికారుల పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైన్ షాపుకి లేని ఆన్లైన్ విధానం యూరియాకి ఎందుకని ప్రశ్నించారు. ఆన్లైన్ విధానం వెంటనే ఎత్తివేసి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.అదికారులు వెంటనే స్పందించి యూరియా కొరత ఆదిగమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసారపు కృష్ణ చైతన్య, యార రాజయ్య, తిరుపతి, సమ్మయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.