గోదావరిఖని, ఆగస్టు 4: ‘ఇదేం అణిచివేత, జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలిపే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో లేదా..? సత్యాగ్రహ దీక్షను అడ్డుకోవడం సరికాదంటూ’ పోలీసులపై క్వార్టర్స్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీనగర్‌లో 82 సింగరేణి క్వార్టర్ల తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ సింగరేణి కార్మిక కుటుంబాలు కొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆదివారం గోదావరిఖని ప్రధానచౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష నిరసన చేపట్టగా,అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళకారులకు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా క్వార్టర్స్ పోరాటపక్ష నాయకుడు తోటవేణు మాట్లాడారు. నిరసన తెలుపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, దీక్షను అడ్డుకోవం సరికాదన్నారు. దీక్షకు నాలుగు రోజుల క్రితం అనుమతులకు మీ సేవలో దరఖాస్తు చేశామని, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అనుమతిపై జాప్యం చేశారని ఆరోపించారు.
దాదాపు రెండు గంటల పాటు గందరగోళం నెలకొనగా, అదనపు పోలీసు బలగాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీక్ష అనుమతిపై పోలీసులు ఏ నిర్ణయం తీసుకోకపోతే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని తోటవేణు తెలిపారు. దీక్షను వాయిదా వేసిన అనంతరం మౌన ప్రదర్శనగా నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ మాదాసు లక్ష్మయ్య, పోతరాజు, భాస్కర్, నరసింహారాజు, రమేశ్, శంకర్, శ్రీనివాస్, జావేద్, దేవా, వెంకటేశ్, కిరణ్, జీ పాష, ఠాగూర్, దబ్బెట సతీశ్, కుమారస్వామి, వెంకటేశ్వర్లు, శ్యామ్, రామస్వామి ఉన్నారు.