Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 20: వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఉంది రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సమాఖ్య గ్రూపు మహిళల పరిస్థితి. ఎందుకంటే.. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు రామగుండం కార్పొరేషన్ నుంచి స్వశక్తి గ్రూపు మహిళలు హాజరు కావాలని ఆదేశించడం ఇక్కడ చర్చనీయాంశమైంది. ఉదయాన్నే రామగుండం మున్సిపల్ నుంచి మేయర్, కమిషనర్ కచ్చితమైన ఆదేశాలు అంటూ స్వశక్తి గ్రూపు మహిళలకు షరతులు విధించారు.
ప్రతీ సమాఖ్య నుంచి వంద మందికి తగ్గకుండా కచ్చితంగా సీఎం సభకు రావల్సిందేననీ, అందుకోసం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశామంటూ గ్రూపు మహిళలకు వాయిస్ సందేశాలు పంపించారు. దీంతో స్వశక్తి మహిళలు ఇరకాటంలో పడ్డారు. అసలే దంచి కొడుతున్న ఎండలు ఒకపక్క వేధిస్తుంటే.. మరోపక్క ఎక్కడో కాటారంలో సీఎం, మంత్రుల బహిరంగ సభకు తప్పకుండా రావల్సిందేనంటూ హుకూం జారీ చేయడంతో స్వశక్తి గ్రూపు మహిళలు మనోవేదనకు గురవుతున్నారు.
పైగా ఒక్కో సమాఖ్య నుంచి కనీసం వంద మంది రావాలని షరతులు విధించడంతో అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాయిస్ మెసేజ్ ను లీక్ చేయడంతో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. అలాగే పలువురు కార్పొరేటర్లు తమ తమ డివిజన్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు కచ్చితంగా రావల్సిందేనంటూ ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలను తరలించారు.