NMBA, programs | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 20 : జిల్లాలో ఈనెల 26 వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆశ్విని తానాజీ వాకడే అన్నారు. ఈనెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురష్కరించుకుని, చేపడుతున్న ఎన్ఎమ్బఏ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు రకాల అవగాహన శిబిరాలు నిర్వహిస్తుండగా, ఇందుకు సంబంధించిన సమన్వయ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగింది.
సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని, కళాశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా చూడాలన్నారు. మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని, రానున్న రోజుల్లో డ్రగ్స్ నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలల వద్ద స్థానికంగా ఉండే దుకాణాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. డ్రగ్స్ కలిగే అనర్ధాలపై సందేశాత్మక వీడియోలు అన్ని విద్యా సంస్థల్లో ప్రదర్శించాలన్నారు. టోల్ ఫ్రీనెంబర్లపై ప్రచారం చేయాలని, ఈనెల 26 వరకు జిల్లాలో నిర్వహించనున్న ర్యాలీలు, అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సిఐ పుల్లయ్య, డివైఎస్ వో శ్రీనివాస్, సిడిపివో శ్రీమతి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోన్రెడ్డి, డిసిపివో పర్వీన్ తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.