నగరంలోని ఐదు ప్రాంతాల్లో నైట్ బజార్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌తో మేయర్ వై సునీల్‌రావు సమాలోచనలు చేసి నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట శాతవాహన యూనివర్సిటీ సమీపంలో బల్దియా ఆధ్వర్యంలో నైట్ బజార్ పనులను ప్రారంభించగా శరవేగంగా సాగుతున్నాయి. రెండు నెలల్లో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
కార్పొరేషన్, అక్టోబర్ 13 : మారుతున్న జీవన విధానంలో నగరవాసులు బీజీగా ఉంటున్నారు. సాయంత్రం, రాత్రిళ్లు బయటకు వెళ్లాలంటే నగరంలో సరైన సదుపాయాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం నగరంలో హోటళ్లు, దుకాణాలు రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగరపాలక సంస్థ మహానగరాల్లో సాగుతున్నట్లుగా కరీంనగర్లో కూడా నైట్ బజార్, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోనే మొదటి సారిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ సమీపంలో నైట్ బజార్, ఫుడ్ కోర్టు పనులను ప్రారంభించారు.
సకల సదుపాయాలతో నైట్ బజార్లు
నగరంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, హైదరాబాద్ రోడ్లలో నైట్ బజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని నగరాల్లో ప్రైవేట్‌గా రాత్రిళ్లు వ్యాపారాలు, సంస్థలు నడుస్తున్నాయి. అయితే, రాష్ట్రంలోనే మొదటి సారిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నైట్ బజార్లను ఏర్పాటు చేస్తున్నారు. బల్దియా ఆధ్వర్యంలో స్టాల్స్ నిర్మించి అద్దెకు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా స్టాల్స్‌లో ఫుడ్కోర్టుతో పాటు వివిధ వస్తువులు విక్రయించేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే, అక్కడి వచ్చే వారికి పార్కింగ్, పబ్లిక్ టాయ్‌లెట్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఇలా అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
శరవేగంగా పనులు
నగరంలో మొదటి నైట్ బజార్‌ను రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీ సమీపంలో మల్కాపుర్ వైపు వెళ్లే రోడ్డును ఆనుకొని స్థలం ఉండడంతో మొదట ఇక్కడ నైట్ బజార్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన రోడ్లలోనూ ప్రభుత్వ స్థలాలను గుర్తించి నైట్ బజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థలాల గుర్తింపు అనంతరం ఆయా రోడ్లలోనూ ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ఫుడ్‌కోర్టులో 25 నుంచి 30 వరకు స్టాల్స్‌ను ఏర్పాటు చేసి వెజ్, నాన్‌వెజ్ ఫుడ్ ఐటమ్స్‌తో పాటు పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు. వీటితో పాటు వివిధ రకాల వస్తువులు అందుబాటులో ఉండేలా షాపులు నిర్వహించుకోవడానికి వీలుగా స్టాల్స్‌ను నిర్మిస్తున్నారు.
ఒక్కో స్టాల్లో ఒక రకమైన ఆహార పదార్థాలు దొరికేలా దుకాణాలను ఏర్పాటు చేయించేందుకు ప్రణాళికలను రూపొందించారు. నైట్ బజార్‌కు వచ్చే వాహనదారులు వాహనాలను నిలిపేందుకు పార్కింగ్, చక్కటి లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్టాల్ వద్ద ఆకర్షణీయమైన సీటింగ్, చిన్న చిన్న పార్కులు, మంచినీటి వసతి, పబ్లిక్ టాయ్‌లెట్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు, పోలీసులు గస్తీ నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. రాత్రిళ్లు లైట్ల వెలుగుల్లో ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు.
అన్ని సదుపాయాలతో ఏర్పాటు
శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఏర్పాటు చేస్తున్న నైట్ బజార్లో అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నం. డిసెంబర్ నాటికి మొదటి బజార్‌ను ప్రారంభించాలన్న లక్ష్యంతో పనులు చేపడుతున్నం. నైట్ బజార్లో నగరవాసులకు వెజ్, నాన్‌వెజ్ ఫుడ్ ఐటమ్స్‌తో పాటు ఇతర వస్తువులు కూడా దొరికేలా స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. దీనిని ప్రారంభించిన అనంతరం ఇతర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి నైట్ బజార్లను ఏర్పాటు చేస్తాం. – వై సునీల్‌రావు, మేయర్