కమాన్ చౌరస్తా, డిసెంబర్ 31 : న్యూ ఇయర్ జోష్ అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా హంగామా అదిరిపోయింది. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2023ను స్వాగతిస్తూ ప్రజలు సంబురాల్లో మునిగితేలారు. ముఖ్యంగా యువతీయువకులు కేరింతలు, నృత్యాలతో సందడి చేశారు. కేకులు కోసి, తినిపించుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సినిమా పాటలపై స్టెప్పులతో అదరగొట్టారు. కరీంనగర్లోని ప్రతి చౌరస్తాలో కేకుల దుకాణాలు వెలిశాయి. వ్యాపారులు స్పెషల్ ఆఫర్లతో ఆకట్టుకున్నారు.
కొనుగోలుదారులతో బేకరీలు, స్వీట్హౌస్లు కిట కిటలాడాయి. ఇటు స్కూళ్లు, కాలేజీల్లో నూతన సంవత్సర సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల, కొత్తపల్లి అల్ఫోర్స్ విద్యా సంస్థల్లోనూ అదిరిపోయేలా వేడుకలు జరుపుకున్నారు. మరోవైపు బేకరీల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించగా, ప్రజలు ఎగబడి కేకులు కొన్నారు. పలు హోటళ్ల నిర్వాహకులు చికెన్, మటన్, చికెన్ ధమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, విజిటేబుల్ బిర్యానీని తక్కువ ధరలకు అందించారు.