కోరుట్ల, ఏప్రిల్ 26: రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చూపుతున్నది. ఫలితంగా అవి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. కోరుట్ల పట్టణంలో మొత్తం 33 వార్డులు ఉండగా, నాలుగు వార్డులకు కలిపి ఒక ఎకరం చొప్పున కేటాయించి మొత్తం 8 క్రీడాప్రాంగాణాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రాంగణానికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించి క్రీడా పరికరాలు సమకూర్చారు. అయితే, కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి వాటి నిర్వహణను పట్టించుకునేవారు లేకపోవడంతో పరికరాలు విరిగిపోయి, తుప్పు పట్టాయి.
ఒకప్పుడు క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడిన ఈ ప్రాంగణాలు ప్రస్తుతం కళా విహీనంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల బోర్డులు కూడా కనుమరుగయ్యాయి. పర్యవేక్షణ లేక పిచ్చి మొకలు, చెత్తా చెదారం, రాళ్లు, రప్పలతో నిండిపోయాయి. మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఈ విషయమై కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ, కోరుట్లలో నిరుపయోగంగా మారిన క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. మున్సిపాలిటీకి ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన యూఐడీఎఫ్ నిధులను కేటాయించి ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామన్నారు.