హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 15 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే పేద రోగుల విషయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం హుజూరాబాద్ ఏరియా దవాఖానలో గర్భిణులకు ఆపరేషన్లు ఆలస్యంగా జరగడంపై ఆయన స్పందించారు. మంగళవారం దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వైద్యులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం గర్భిణులకు వైద్యులు డెలివరీ ఆలస్యం చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన కేసీఆర్ కిట్‌కు పేరు మార్చయినా ఇవ్వాలని, జనాలకు మేలు చేసే పథకాలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ సర్కారు హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం పూర్తిస్థాయిలో అందేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ స్థాయిలో చికిత్స అందడం లేదన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు ఇక్కడ నెలకు 200కు పైగా డెలివరీలు జరిగేవని, ప్రస్తుతం ఆస్థాయి గణనీయంగా పడిపోయిందన్నారు. హుజూరాబాద్ దవాఖానకు ఒక గైనకాలజిస్ట్‌తో పాటు అనస్తీషియా వైద్యుడిని వెంటనే కేటాయించాలని, అలాగే, జమ్మికుంటకు కూడా గైనకాలజిస్టును నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, సూపరింటెండెంట్ రాజారెడ్డి, ఆర్ఎంవో సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.