paddy purchase | పెద్దపల్లి, అక్టోబర్15: జిల్లాలో వానా కాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికార యంత్రాంగం సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి వరి ధాన్యాన్ని 24 గంటల్లోగా రైస్ మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం పంట కొనుగోలుపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాస్తా ముందుగానే ప్రారంభించాలన్నారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోగా రైస్ మిల్లులకు తరలించి ట్యాబ్ ఎంట్రీ చేయాలని సూచించారు. రైతులు వరి కోతల సమయంలో పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. నవంబర్ చివరి వరకు జిల్లాలో 2 లక్షల పైగా మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఎం శ్రీకాంత్, డీఎంవో పీ ప్రవీణ్ రెడ్డి, డీఆర్డీవో కాళిందిని, డీఏవో బీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.