General strike | కోరుట్ల, మే 18: కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఈనెల 20న జరుప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9 తేదీకి వాయిదా వేసినట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షులు చింత భూమేశ్వర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎండి చౌదరి తెలిపారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవన్ లో కార్మిక సంఘాల నాయకుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పహాల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం, తదనంతర రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని సమ్మె వాయిదా వేసినట్టు తెలిపారు. కార్మిక సమస్యలు విన్నవించుటకు తగిన సమయం కాదనే ఉద్దేశంతో, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని సమ్మె వాయిదా వేయడం జరిగిందన్నారు.
సమ్మె వాయిదా వేసిన ఈనెల 20న కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకై నిరసనలు ధర్నాలు, ఊరేగింపులు, సభలు, నిర్వహించాలని వారు కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు రామిల్ల రాంబాబు, దేశవేని నరసయ్య, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.