కరీంనగర్ కమాన్చౌరస్తా, డిసెంబర్ 1 : అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయమని, ఎమ్మెల్సీగా ప్రజల ముందుకు వచ్చేది అభివృద్ధి చేసేందుకేనని, రాజకీయం చేయడానికి కాదని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వీ నరేందర్రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎస్సారార్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈరోజు పట్టభద్రులంటే ఎవరికీ పట్టని ఓటర్లుగా, భద్రత లేని వ్యక్తులుగా తయారయ్యారని, కనీసం సాధారణ ఓటరుకు ఉన్న గౌరవం కూడా ఈ ప్రభుత్వాలు, పార్టీలు పట్టభద్రులకు ఇవ్వడం లేదన్నారు. దీనికి కారణం పట్టభద్రుల తరఫున ప్రశ్నించే గొంతు పటిష్టమైంది కాకపోవడమేనని చెప్పారు. పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉన్న వాళ్లు ఎమ్మెల్సీగా ఉండాలన్నారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల యజమానిగా తాను ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తయారు చేశానని, ఎంతో మంది పట్టభద్రులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. తనను కన్న కరీంనగర్ నేల తల్లి సాక్షిగా చెప్తున్నానని, ఈ జీవితం పట్టభద్రుల అభివృద్ధికే అంకితమిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమానికి పలు విద్యాసంస్థల చైర్మన్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, నగర యువకులు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.