ధర్మపురి, మార్చి 20: ధర్మపురిలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం కన్నులపండువగా జరుగగా.. శ్రీలక్ష్మీ నర్సింహస్వామి దక్షిణ దిగ్యాత్ర ఘట్టాన్ని ఘ నంగా నిర్వహించారు. స్వామివార్లు దక్షిణంవైపు విహారయాత్రకు బయలుదేరే కార్యక్రమాన్ని దక్షిణ దిగ్యాత్రగా పిలుస్తారు. ఈ దిగ్యాత్రలో భాగంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి(యోగ, ఉగ్ర) ఉత్సవమూర్తులను సేవలపై ఉంచి శోభాయాత్రగా దక్షిణ దిశలోని పోలీస్ స్టేషన్ వైపు తీసుకెళ్లారు. స్వామివారి సేవను జిల్లా అడిషనల్ ఎస్పీ రూపేశ్, జగిత్యాల, మెట్పల్లి డీఎస్పీలు ప్రకాశ్, రవీందర్రెడ్డి, ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్ఐలు కిరణ్కుమార్, నరేశ్, సందీప్, పోలీస్ సిబ్బంది స్టేషన్ వరకు శోభాయాత్రగా తీసుకెళ్లారు. స్టేషన్ ఆవరణలో పోలీస్ కుటుంబాలు స్వామివారి సేవలకు ఘన స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. పోలీస్స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులను ఉంచి, స్వామివార్ల ఎదుట ఆయుధాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ శ్రీనివాస్, మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత, రెనోవేషన్ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు ఉన్నారు.