Nalgonda | తిమ్మాపూర్, మార్చి6 : భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి జాతర ముగిసింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి రథోత్సవము ఘనంగా నిర్వహించారు. గురువారం అర్ధ రాత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళ తాలాల మధ్యన స్వామి వారిని ఊరేగింపుగా ఆలయం నుండి రథం పైకి తీసుకొచ్చారు. రాత్రి నుండి భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
రథంపైన రూపాయి బిల్ల పెట్టి మొక్కులు తీర్చుకోవడం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుండగా భక్తులు దానిని కొనసాగించారు. రథంపైన స్వామి వారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దివిటీలను, కాగడాలను వెలిగించి రథం ఎదుట జీవాలను బలి చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గండదీపంలో నూనెను పోశారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని అర్చనలు చేయించుకుని, కొబ్బరి కాయలు కొట్టి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం స్వామి వారు రథం నుండి గర్భ గుడికి వేం చేశారు.
ఈ అద్భుతమైన ఘట్టాన్ని భక్తులు తరించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మన్, ఈవో అనిల్ కుమార్, కమిటీ సభ్యులు, దాతలు, వాలంటీర్లు వసతులు కల్పించారు. రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. రథోత్సవ వేడుకలకు నల్లగొండతోపాటు మండలంలోని పలు గ్రామాల నుండి కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి, వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయంకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.