పెద్దపల్లి, జూన్ 15(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పదకొండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన ముజామ్మిల్‌ఖాన్ పాలనలో తనదైన మార్క్ చూపించారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చిరాగానే పెద్దపల్లి నూతన కలెక్టరేట్‌ను ఆకర్షణీయంగా తీర్చిద్దారు. కలెక్టరేట్ స్వాగత ద్వారంతో పాటు గోడలపై తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకృతులను వేయించారు. కార్యాలయం ఆరంభంలోనే ప్రజలకు సేవలందించేందుకు ఇన్వర్డ్తో పాటుగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్ర ఉట్టిపడేలా ప్రత్యేక పురావస్తు మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.
ఇంకా ప్రతిశాఖ కార్యాలయానికి వెళ్లే కలెక్టరేట్ గోడలపై పెద్దపల్లి జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలతో డిజిటల్ ఫొటోలను ఏర్పాటు చేయించారు. కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులు స్త్రీలు, పురుషులకు ప్రత్యేకంగా భోజన శాలలను ఏర్పాటు చేయించారు. ఎంప్లాయీస్ ఆరోగ్య స్థితిపై హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టించి, ఫ్రెండ్లీ కలెక్టర్‌గా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చక్కని విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి బుధవారం ఒక ప్రభుత్వ పాఠశాలను, వసతి గృహాన్ని సందర్శించి అక్కడే భోజనం చేసే విధంగా ‘లంచ్ అండ్ లెర్న్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి సక్సెస్‌ఫుల్‌గా అమలు చేశారు.
ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా అందుబాటులోకి వస్తూ నేరుగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పేదల కలెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని, సమస్యలతో ఎవరూబాధపడొద్దని అనేక ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి విజయవంతంగా అమలు చేశారు. సేవ చేయడమే అభిమతంగా చదు వు, ఆపద సమయాల్లో అండగా ఉన్నారు. ఆయన వచ్చిన నెల రోజుల్లోనే అంటే.. గత జూలైలో మంథని మండలం గోపాల్పూర్ మానేరునదిలో భారీ వరదల్లో ఆరుగురు చిక్కుకుంటే.. స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అందరినీ సురక్షితంగా తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొం దారు. కమాన్‌పూర్ పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్ రాజగోపాల్ కుమారుడి గుండె ఆపరేషన్‌కు చికిత్స కోసం.. తన ఒక్క పిలుపుతో జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ద్వారా 15.73, 634 సేకరించి వారికి అందింపజేశారు. ఇలా గొప్పగా సేవలందించిన కలెక్టర్ పదకొండు నెలలకే బదిలీపై వెళ్తుండడం ఇటు ప్రజలు, అటు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.