knowledge of laws | సుల్తానాబాద్ రూరల్, మే 1: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవాదికారా సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి దుర్గం గణేష్ మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం కోసం మండల న్యాయసేవాధికార సంస్థ ను సంప్రదించాలని, ప్రజలకు న్యాయ సహాయం అందించేందుకు మండల న్యాయసేవాధికార సంస్థ ముందుంటుందని అన్నారు.
ప్రతీ ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మండల న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందని అన్నారు. ప్రతీ కార్మికుడు కార్మిక చట్టాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ప్రజలకు కార్మిక చట్టాల గురించి వివరించారు. అనంతరం మేడే సందర్భంగా జడ్జి దుర్గం గణేష్ మున్సిపల్ కార్మికులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, ఏజీపీ దూడం ఆంజనేయులు,, సెంకడ్ క్లాస్ మెజిస్ట్రేట్ నేరెళ్ల శంకరయ్య, లోక్ అదాలత్ సభ్యులు మాడూరి ఆంజనేయులు, చీకటి సంతోష్, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, న్యాయవాదులు వొడ్నాల రవీందర్, అవునూరి సత్యనారాయణ, జోగుల రమేష్, సామల రాజేంద్ర ప్రసాద్, గుడ్ల వెంకటేష్ , మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు పాక మహేష్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.