వేములవాడ, డిసెంబర్ 28: జాతీయ పార్టీల్లో ముసలం పుట్టింది. సెస్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అగ్రనేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే నష్టం జరిగిందని ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఎల్లారెడ్డిపేట అభ్యర్థి విషయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై ఆ ప్రాంత నేతలు చిరుబుర్రులాడుతుండగా, తాజాగా కాంగ్రెస్ పార్టీలోనూ చిచ్చు రగులుతున్నది. ఎన్నికల వేళ పలువురు ఒంటెత్తు పోకడలతో తీరని నష్టం చేశారని, ఇలా అయితే తాను పార్టీలో ఉండలేనంటూ ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దురిశేట్టి అరుణ్ తేజ చారి ప్రకటన జారీ చేయడం కలకలం రేపుతున్నది.
సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మద్దతు దారుల ఘోర పరాభవంతో ఆ పార్టీల్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వాస్తవానికి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరుగలేదని, ఎవరివారే యమునా తీరే అన్నచందంగా పరిస్థితి తయారైందని మొదటి నుంచీ క్షేత్రస్థాయి నాయకులు చెబుతున్నారు. అయితే 15 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడంతో ఆ పార్టీల్లో ముసలం మొదలైంది. అభ్యర్థుల గెలుపు కోసం జిల్లా నాయకులు ఏ మాత్రం పనిచేయలేదని కార్యకర్తలు చిరుబుర్రులాడుతున్నారు. బీజేపీ జిల్లా అగ్రనేతలు కనీసం ప్రచారంలో పాల్గొనకపోవడంపై మండిపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ప్రతాప రామకృష్ణ కనీసం కౌం టింగ్ కేంద్రం వైపు కూడా చూడకపోవడంపై బహిర్గతంగానే విమర్శలు చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట సెస్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆయన ఏకపక్షంగా వ్యవహించారని, స్థానిక నాయకుల అభిప్రాయం కనీసం తీసుకోలేదని బాహాటంగానే విమర్శ లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నాయకత్వ లోపంపై ఇప్పటికే బీజే పీ రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే సద రు జిల్లా నాయకుడి తీరునుపై విమర్శిస్తూనే ఇకపై ఆయన నా యకత్వంలో పనిచేయబోమని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీలోనూ సెస్ ఎన్నికల చిచ్చు రగులుతోంది. పార్టీలో కొందరు ఒంటెద్దు పోకడలు, ఎన్నికల వేళ వ్యవహరించిన తీరుపై జిల్లా నాయకులకు మింగుడుపడడం లేదు. తాజాగా జిల్లా ఉపాధ్యక్షుడు దురిశెట్టి అరుణ్ తేజ చారి పార్టీని వీడుతున్నట్లు బుధవారం ప్రకటన జారీ చేశారు. తాను 24ఏళ్లుగా పార్టీలో పని చేశానని, పదవులు ఆశించకుండా పనిచేసినప్పటికీ కొందరి తీరు చాలా బాధిస్తున్నదన్నారు. పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌కు పంపినట్లు చెప్పారు. మెగాస్టార్ అభిమానిగా తాను ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పుకొచ్చారు.