Create awareness | కోల్ సిటీ, జూన్ 19: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కలిగేందుకు వినూత్నంగా గోడ చిత్రాలు వేయించారు. వంద రోజుల కార్యచరణలో భాగంగా నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు గురువారం గోదావరిఖని నగరంలో ప్రధాన రహదారి వెంట గోడలకు కుడ్య చిత్రాలను వేసే పనులను చేపట్టారు.
నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి పర్యవేక్షించారు. ఐఈసీ కార్యకలాపాల్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించడం, చెత్త రీ సైకిలింగ్, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా గోడ చిత్రాలను వేయించారు. అలాగే ప్రత్యేక పారిశుధ్య పనులు గురువారం కూడా కొనసాగాయి. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్, వార్డు అధికారులు, సహాయకులు, జవాన్లు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.