జగిత్యాల అర్బన్, జూన్ 19: ఫేక్ వీఎల్‌టీపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వరంగల్ రీజనల్ డైరెక్టర్ షాహీద్ మసూద్ జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం విచారణ చేపట్టారు. జగిత్యాల ‘మున్సిపాలిటీలో భారీ భూ బాగోతం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఫేక్ వీఎల్టీ మంజూరు చేసిన జగిత్యాల మున్సిపల్ ఆర్వో ప్రసాద్, కమిషనర్ అనిల్బాబుతోపాటు కబ్జా చేసిన మరో ముగ్గురిపై జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
విచారణ చేసిన పోలీసులు జగిత్యాల మున్సిపల్ ఆర్వో ప్రసాద్, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కమిషనర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా, బుధవారం రీజనల్ డైరెక్టర్ మసూద్ వీఎల్టీ నంబర్‌కు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. కార్యాలయంలోని రెవెన్యూ విభాగం సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. చర్యల కోసం నివేదికను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డైరెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఆయన వెంట జగిత్యాల ఇన్చార్జి కమిషనర్ యాదగిరి ఉన్నారు.