Mulkanoor | కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లి పనిచేయలేక దిక్కుతోచని స్థితిలోకి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామానికి చెందిన దొబ్బల బాలరాజు (50) ఏడు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే బాలరాజు అక్కడికి వెళ్లిన తర్వాత ఆరోగ్యం బాగాలేక పనిచేయని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న బాలరాజుకు యాజమాన్యం నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి.
బాలరాజు పనిచేస్తున్న సదరు కంపెనీ యజమాన్యం అతని పాసుపోర్టు లాక్కుని వేధిస్తోంది. దీంతో బాలరాజు దుబాయ్‌లో తన కష్టాలు వివరిస్తూ భార్యకు సెల్ఫీ వీడియో పంపాడు. ఈ నేపథ్యంలో తన భర్త పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేందుకు సాయం చేయాలని బాలరాజు భార్య స్వరూప ప్రభుత్వాన్ని కోరింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని స్వరూప విజ్ఞప్తి చేసింది. బాలరాజుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు.