Jagityal | జగిత్యాల : రాజకీయాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ తేజస్వి సూర్య ను పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని తెలంగాణవాది, ఉద్యమకారుడు, జానపద కలకారుడు అలుగునూరి@ మోరపల్లి ప్రదీప్ కుమార్ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజం, తెలంగాణా తల్లి క్షోబించేలా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. దేశ భవిష్యత్, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రజాప్రతినిధుల సభలో ఇలాంటి అజ్ఞని ఉండడం దురదృష్టకరమన్నారు.
1200 మంది ఆత్మబలిదానాలు, నాలుగు కోట్ల తెలంగాణా సమాజం ఏకతాటిపైకి వచ్చి పోరాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రాన్ని భారత్ – పాక్ విభజనతో పోల్చడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. స్వయం పాలనలో పదేళ్లు గడిచి, దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణా రాష్ట్రంపై ఇంకా అక్కసు వెళ్లగక్కడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. తేజస్వి సూర్య తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని, ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేసి, వక్రీకరించారని బుకాయించడం సరికాదన్నారు.
ఆయనను తక్షణమే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటుగా, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు గాను ఆయన్ని భవిష్యత్ లో ఏ పదవికి పోటీ చేయకుండా అనర్హత వేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై గానీ, తెలంగాణ సమాజం పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.