Suicide | సిరిసిల్ల రూరల్, నవంబర్ 28 : రాజన్న సిరిసిల్ల జిల్లా లో దారుణం ఘటన శుక్రవారం జరిగింది. తల్లి మానేరువాగులో దూకి ఆత్మహత్య చేసుకోగా, తల్లి మృతిని తట్టుకోలేక అదే మానేరువాగులో కొడుకు దూకి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. తల్లి, కొడుకుల మృత్యువాతతో తంగళ్లపల్లి లో విషాధం నింపింది.
స్థానికుల కథనం ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మంచికట్ల లలిత దేవరాజందంపతులకు కు కొడుకు అభిలాష్ (33), కూతుర్లు, మౌనిక, మానస ఉన్నారు. ఇద్దరు కూతుర్లకు వివాహం చేశారు. దేవరాజు 8 ఏండ్ల క్రితం మురికి కాలువలో పడి మృతి చెందాడు. కొడుకు అభిలాష్‌కు 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం 17వ పోలీస్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అభిలాష్‌కు వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భర్త దేవరాజు మృతి చెందినప్పటి నుంచి కొంత అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ క్రమంలో గురువారం ఇంట్లోంచి వెళ్లిన లలిత రోజైనా ఇంటికి చేరలేదు.
శుక్రవారం ఉదయం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంతలో సిరిసిల్ల మానేరువాగులో గురు తెలియని మహిళా మృతదేహం లభ్యమవ్వడంతో పోలీసులు చేరుకుని, వెలికి తీశారు. మృతి చెందిన మహిళ లలిత కావడంతో లలిత మృతదేహంను చూసిన కొడుకు అభిలాష్ బోరున విలపించాడు. పోలీసులు, స్థానికులు అందరూ చూస్తుండంగానే వారి ముందే అభిలాష్ మానేరువాగులో దూకాడు. అక్కడ ఉన్న ఎవరికి ఈత రాకపోవడంతో కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. తల్లి లలిత, కొడుకు అభిలాష్ మృతదేహాలను సిరిసిల్లలోనిప్రభుత్వ దవాఖానకు తరలించారు. తల్లి, కొడుకుల ఆత్మహత్యతో తంగళ్లపల్లిలో విషాధం నిండింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.