karimnagar | కమాన్ చౌరస్తా, ఆగస్టు 25: జమాతే ఇస్లామీ హింద్(జేఐహెచ్)కరీంనగర్ ఆధ్వర్యంలో ‘ప్రవక్త మహ్మద్(స) జన్మదినం’, ‘మిలాద్ఉన్నబీ’ని పురస్కరించుకొని ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్25 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మహ్మద్నయీముద్దీన్ పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉత్తమ సమాజం, సామాజిక రుగ్మతలను రూపుమాపడం, ఇహ–పరలోకాల సాఫల్యం కోసం ప్రవక్త మహ్మద్(స) బోధనలు ఎంతో దోహదపడుతాయని చెప్పారు.
ప్రవక్త మహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) “అందరివాడు” అని, ఆయన కేవలం ఒక వర్గానికి కాకుండా సమస్త మానవాళికి మార్గదర్శకంగా పంపబడ్డారని, ఆయన కరుణ, దయ అందరిపట్ల సమానంగా ఉంటాయని, ఆయన బోధనలు అన్ని వర్గాల ప్రజలకూ వర్తిస్తాయని, ఆయన దయాదృష్టి అంతరిక్షం నుండి భూమి వరకు, ఆదం నుండి ప్రళయం వరకు అందరిపట్ల సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన రహతుల్ ఆలమీన్ అని చెప్పారు. ప్రవక్త కేవలం ముస్లింలకే హితబోధ చేయలేదని, మానవులందరికీ ఆయన మార్గనిర్దేశం చేశారన్నారు. సమసమాజం ఆయన చేసిన కృషి అందరికీ అనుసరణీమన్నారు. ప్రవక్త బోధనలను సమాజంలో విస్తరింపజేసేందుకు జమాతే ఇస్లామీ హింద్విశేష కృషి చేస్తున్నదని అన్నారు.
ప్రవక్త చరిత్ర, బోధనలు, సమాజం కోసం చేసిన కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు జేఐహెచ్ఆధ్వర్యంలో క్యాడర్ మీట్, వివిధ పాఠశాలలు, కాలేజీల్లో పోటీలు నిర్వహించడంతో పాటు ‘చెడు నిర్మూలన’ అనే అంశంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు నిర్ణయించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి షేక్ ఇసాఖ్ అలీ, కో కన్వీనరగ్ అమ్మర్ లతీఫీ తదితరులు పాల్గొన్నారు.