వదలని వర్షం.. జీనజీవనం అతలాకుతలం
నారాయణపూర్ రిజర్వాయర్‌కు భారీగా వరద
ప్రమాదం పొంచి ఉండడంతో ముందస్తుగా గండికొట్టిన అధికారులు
తెగిపోయిన ఎల్లమ్మ చెరువు కట్ట
పలు గ్రామాల్లోకి చేరిన నీరు
నగునూర్‌లో వరదలో చిక్కుకున్న తొమ్మిది మంది ఇటుక బట్టీ కార్మికులు
సహాయక చర్యలు చేపటి న మంత్రి గంగుల
వర్షంధాటికి పలుచోట్ల తెగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు
జిల్లాలో సగటున 103.5 మిల్లీమీటర్ల వర్షపాతం
కరీంనగర్, జూలై 14(నమస్తే తెలంగాణ): భారీ వానలతో జిల్లాలో వరదలు పోటెత్తాయి. ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు పడుతుండగా, వాగులు, వంక లు పొంగి పొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాలకు వరదాయినిగా ఉన్న నారాయణ పూర్ రిజర్వాయర్, గంగాధరలో ఎల్లమ్మ చెరువు కట్ట తెగిపోగా, సమీప గ్రామాల్లోకి నీరు చేరింది. వరద భారీగా వస్తుండడంతో చొప్పదండి నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటలు ప్రమాదంలో కనిపిస్తున్నాయి. కాగా, గురువారం జిల్లాలో సగటున 103.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఒడిశా కార్మికులను కాపాడిన మంత్రి
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ శివారులో ఉన్న ఇటుక బట్టీల కార్మికులు భారీ వర్షాలకు అక్కడే ఉంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బట్టీలకు ఇరువైపులా ఇరుకుల్ల, నగునూర్ వాగుల్లో గురువారం వరద పోటెత్తింది. దీంతో బట్టీల చుట్టూ వరద ప్రవహిస్తుండడంతో బట్టీల యజమాని అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే నగర శివారులోని తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ గ్రామాల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌కు విషయం తెలియడంతో వెంటనే అక్కడికి వెళ్లి అధికారులను పురమాయించారు. రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. అప్పటికే వరద చుట్టు ముట్టడంతో ఇటుక బట్టీలపై బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న తొమ్మిది మంది ఒడిశా కార్మికులను అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కార్మికులు ఒడ్డుకు వచ్చే దాకా మంత్రి అక్కడే ఉన్న వాటర్ ట్యాంక్‌పై ఎక్కి పరిస్థితిని సమీక్షించారు. కార్మికులను కాపాడిన రెస్క్యూ టీంను మంత్రి గంగుల అభినందించారు. ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు సహా తొమ్మిది మంది కార్మికులు ఈ సందర్భంగా మంత్రి గంగులకు కృతజ్ఞతలు తెలిపారు.
నారాయణపూర్ కట్టకు గండి..
గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌కు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అధికారులు గండి కొట్టారు. భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్‌లోకి విపరీతమై న వరద రావడం, మత్తడి ద్వారా వెళ్లే ప్రవాహం కంటే ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో నారాయణపూర్ సమీపంలో కట్ట తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రిజర్వాయర్ కట్టకు కుడి వైపున గండి కొట్టి నీటిని బయటికి వదిలారు. గండి కొట్టని పక్షంలో తెగి నారాయణపూర్‌కు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఏర్పడేది. అలాగే గంగాధర మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్ట తెగిపోయింది. ఈ రెండు చెరువుల నుంచి వచ్చిన వరద కారణంగా నారాయణపూర్, నాగిరెడ్డిపూర్, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లోకి వరద వచ్చింది. ముఖ్యంగా నారాయణపూర్ శివారులోని ఇస్తారిపల్లి ఎస్సీ కాలనీని అధికారులు ఖాళీ చేయించారు. గంగాధరలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వీరికి పునరావాసం కల్పించారు. గంగాధర లక్ష్మీదేవిపల్లి రోడ్డుపై వరద విపరీతంగా వస్తుండడంతో రాకపోకలు నిలిచి పోయాయి. 264 క్యూబిక్ ఫీట్ల నీటి సామర్థ్యం ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఎల్లంపల్లి నుంచి నేరుగా పైప్‌లైన్ ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా 36 గ్రామాలకు సాగు నీరు అందుతోంది. చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు కొత్తపల్లి మండలంలోని పలు చెరువులకు కూడా నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారానే నీటి సరఫరా అవుతోంది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులు ముంపు ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు.
పెరిగిన వరద తాకిడి..
భారీ వర్షాలతో జిల్లాకు వరద తాకిడి పెరిగింది. చొప్పదండిలోని శనగ కుంట తెగిపోయే ప్రమాదం ఉండగా ఎమ్మెల్యే రవిశంకర్, కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. నీటిని మళ్లించాలని అధికారులను ఆదేశించడంతో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ భూమారెడ్డి స్వయంగా పర్యవేక్షించి నీటిని మళ్లించారు. రామడుగు మండలం గుండి చెరువు మత్తడి పడుతోంది. వర్షానికి ఇక్కడి పీరీల చావడి కూలిపోయింది. వన్నారం వద్ద నిర్మాణంలో ఉన్న చెక్‌డ్యాం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రామడుగు వాగులో వరద ఉధృతి నిన్నటి నుంచి తగ్గక పోవడంతో రాకపోకల నిలిచిపోయే ఉన్నాయి. ఇక్కడి పరిస్థితిని కూడా ఎమ్మెల్యే రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. తిమ్మాపూర్ మండలం నేదునూర్లోని గోసంగి కాలనీలోని 20 కుటుంబాలను అధికారులు స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. భోజనాలు ఏర్పాటు చేశారు.
మానకొండూర్ మండలంలోని అనేక చెరువులు, కుంటలు మత్తళ్లు పారుతున్నాయి. దీంతో రోడ్లపైకి, పంట పొలాల్లోకి నీళ్లు చేరుతున్నాయి. గంగిపెల్లి, అన్నారం గ్రామాల మధ్య కొత్తగా వేస్తున్న రోడ్డు వరద తాకిడికి కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిస్థితిని సమీక్షించారు. శంకరపట్నం మండలం అర్కండ్ల, కన్నాపూర్ గ్రామాల మధ్య కాజ్ వేపై పారుతున్న నీటి ప్రవాహాన్ని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ పరిశీలించారు. కన్నారంలో ఇండ్లు కూలిపోయిన బాధితులకు జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి బియ్యం పంపిణీ చేశారు. వీణవంక మండలం నర్సింగాపూర్‌లో వరద తాకిడికి రోడ్డు కొట్టుకుపోయింది. జమ్మికుంట మండలం వావిలాల్, పెద్దంపల్లి, పాపక్కపల్లి గ్రామాల్లోని వరద ప్రభావిత కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేర్చి పునరావాసం కల్పించారు. హుజూరాబాద్‌లో వరద సహాయక చర్యలను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక పర్యవేక్షించారు. కరీంనగర్లో వరద బాధిత ప్రాం తాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.