కలెక్టరేట్, మార్చి 18 : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వివక్ష విడనాడి పారదర్శకత పాటిస్తే, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తెలంగాణ మేధావుల ఫోరం జిల్లాశాఖ అధ్యక్షుడు మహ్మద్ ఇంతియాజ్ అన్నారు. మంగళవారం నగరంలోని ముకరంపురలో గల ఆసంఘం జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకంలో కేవలం కొన్ని వర్గాల యువతకే ప్రాతినిత్యం కల్పించకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువజనులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
రాష్ట్రంలోని ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా దానిని కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం చేయటం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి అన్ని వర్గాల యువతకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కాశబోయిన మహేందర్, సంఘం ప్రతినిధులు ఏసోబు, బి.భాస్కర్ కుమార్, అడ్వకేట్ ఓంప్రసాద్, కనపర్తి శ్రీనివాస్, మనోహరస్వామి, మాదిరెడ్డి ప్రభాకర్, కెంచ రామస్వామితో పాటు పలు మండలాల నుంచి వచ్చిన ఆయా మండల శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.