పెద్దపల్లి కమాన్, డిసెంబర్ 15 ;సైన్స్ పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కండ్ల ముందు వివరిస్తే మదిలో అలాగే ఉండిపోతాయి. కానీ, పదో తరగతి వరకు ప్రయోగశాలలు తక్కువే. 8, 9, 10వ తరగతి గ్రామీణ విద్యార్థులు విషయ పరిజ్ఞానంలో వెనుకబాటుకు ఇదొక కారణం కాగా, సైన్స్‌పై అవగాహన, నైపుణ్యాన్ని పెంచాలన్న సంకల్పంతో పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా మొబైల్ సైన్స్ ల్యాబ్‌ను నెల క్రితం అందుబాటులోకి తెచ్చారు. స్పెషల్ టీంతో కూడిన ఈ వాహనం ప్రతి రోజూ రెండు స్కూళ్లకు వెళ్తూ.. జీవ, రసాయన, భౌతిక శాస్ర్తాలకు సంబంధించి జంతువుల అవయవాలతో అవగాహన కల్పిస్తున్నది. ముఖ్యంగా కఠినమైన అంశాలను ఎంపిక చేసి, వాటిని సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నది.
విన్నదానికంటే చూసి నేర్చుకున్నది ఎప్పటికీ గుర్తుంటుంది. ఇంకా లైవ్‌గా చూపిస్తే మదిలో అలాగే పాతుకుపోతుంది. ఇలాంటి ప్రయోగమే చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. బడి పిల్లల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా మొబైల్ సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయించారు. కృత్యాధార బోధనలో నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్లతో ప్రత్యేక బృందాన్ని ఎంపిక చేసి, ప్రతి రోజూ రెండు స్కూళ్లలో జంతువుల అవయవాలు, ఇతర పరికరాలతో ప్రత్యక్షంగా ప్రయోగాలు చేయిస్తూ, అవగాహన కల్పిస్తుండడంతో పిల్లలూ ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
రెండేళ్లుగా కొవిడ్-19 కారణంగా పాఠశాలలు సరిగ్గా నడవకపోవడంతో విద్యార్థులు ఆన్లైన్లోనే పాఠాలు విన్నారు. ఇన్ని రోజులు చదివిన ప్రతి విషయంపై పట్టుకోల్పోయారు. విషయ పరిజ్ఞానంలో వెనుకబడ్డారు. కొవిడ్ తగ్గి, మళ్లీ పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ టీచర్లు చెప్పే పాఠాలను విద్యార్థులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనిపై ఆరా తీసిన కలెక్టర్ సంగీత సత్యనారాయణ, డీఈవో మాధవి, జిల్లాలోని 122 పాఠశాలల్లో 8, 9,10వ తరగతి విద్యార్థుల్లో శాస్త్రీయ అభిరుచి, పరిశీలనా శక్తి పెంపొందించాలని సంకల్పించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని గత నవంబర్ 17న పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలల్లో సంచార ప్రయోగశాల (మొబైల్ సైన్స్ ల్యాబ్)ను ఏర్పాటు చేయించారు.
చేయించే ప్రయోగాలివే.. జీవశాస్త్రంలో..
ఊపిరితిత్తులు: ఉచ్ఛాస, నిచ్ఛాస, ఊపిరితిత్తులకు వ్యాధులు, తదితర అంశాలపై క్లుప్తంగా వివరించడం.
గుండె: గుండెలోని గదులు, రక్తనాళాలు మూసుకుపోవడం, గుండెపోటు రావడానికి కారణాలు, గుండె పనితీరుపై ప్రత్యక్షంగా వివరించడం
రక్త పరీక్షలు: రక్తం గ్రూపులను విద్యార్థుల ముందే పరీక్ష చేసి, గ్రూపులను నిర్ధారించడం.
ఏక దళ, ద్విదళ జీజాల బేధాలను గుర్తించడం, చెట్ల వేర్లపై అవగాహన కల్పించడం.
పిండి పదార్థాల నిర్ధారణ ఆకు అంతఃనిర్మాణంపై వివరించడంగొర్రె శ్వాస వ్యవస్థను, గుండె పనితీరును ప్రత్యక్షంగా చూపించడం
జంతువుల అవయవాలతో అవగాహన..
టీచర్లు తరగతి గదిలో బ్లాక్ బోర్డుపై చెప్పిన పాఠాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉపకరాలను ఉపయోగించి, ప్రత్యక్షంగా చూపించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. కాగా, ఇందుకు భౌతిక, రసాయన, గణితం, వృక్ష, జీవశాస్ర్తాల్లోని 60కి పైగా అంశాలపై కృత్యాధార బోధనలో నిపుణులైన జిల్లాలోని 45 మంది నిష్ణాతులైన రీసోర్స్ పర్సన్లను ఎంచుకున్నారు. వారితో ప్రత్యేకంగా పలు ఉపకరణాలను తయారు చేయించారు. టీంకు తొమ్మిది మంది చొప్పున ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు ప్రతి రోజూ రెండు స్కూళ్లకు వెళ్తూ అవగాహన కల్పిస్తున్నారు. చాలా కఠినమైన అంశాలను ఎంపిక చేసి, వాటిపై కృత్యాధార బోధన చేసి సులభంగా అర్థమయ్యేలా ప్రయోగాలు చేయిస్తున్నారు. ముఖ్యంగా సైన్స్ పాఠాల్లోని పలు పార్ట్స్‌పై మరింత లోతుగా అవగాహన కల్పిస్తున్నారు. వివిధ జంతువుల అవయవాలను తీసుకువచ్చి, ప్రత్యక్షంగా వాటి గురించి వివరిస్తున్నారు. విద్యార్థులను చేతులతో పట్టుకోనివ్వడం, రక్త నమునాల పరీక్షలను వారి ముందే చేసి చూపిస్తున్నారు. అలాగే సైన్స్, మ్యాథ్స్ పట్ల విద్యార్థుల్లో భయాన్ని తొలగించి సులభంగా అర్థమయ్యేలా లాజికల్ ట్రిక్స్ ద్వారా లెక్కలు చెబుతున్నారు. జిల్లాలోని 122 పాఠశాలల్లో 8,9,10వ తరగతి విద్యార్థులు దాదాపు 20వేల మందికి ప్రయోగాత్మకంగా కృత్యాధార బోధన చేస్తున్నారు.
భౌతిక, రసాయన శాస్ర్తాల్లో..ఆమ్లాలు, క్షారాలు గుర్తించే పరీక్షలు..
లోహాలు, అలోహాలతో చర్య, వాయువుల వ్యాపనం
పుటాకార, కుంభాకార దర్పణాలతో, కటకాలతో ప్రతిబింబం ఏర్పడే విధానం
కాంతి పరివర్తన నియమాలు నిరూపించే ప్రయోగాలు, కాంతి వక్రీభవన సూత్రాలను వివరించే ప్రయోగాలు
ఎలక్ట్రిక్ సర్క్యూట్, సమాంతర సంధానం, శ్రేణి సంధానాలకు సంబంధించిన ప్రయోగాలు..
ఆసక్తి పెంచేందుకే..
కొవిడ్ కారణంగా విద్యార్థులు చదువులో వెనుకబడ్డారు. ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాస్‌లు వినడం వల్ల అంతగా నేర్చుకోలేకపోయారు. చదువుపై ఆసక్తి పెంచేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కలెక్టర్ చొరవతో జిల్లాలో మొబైల్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించాం. తరగతి గదుల్లో చెప్పినదాని కన్నా ప్రయోగాలు చేసి చూపించడం వల్ల పాఠాలు సులభంగా అర్థమవుతాయి. ప్రతి రోజూ రెండు పాఠశాలల్లో ప్రయోగపూర్వకంగా వివరిస్తున్నారు. పిల్లలూ చాలా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.