కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటు హక్కు దరఖాస్తులు వేల సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గంలో 20 వేలకుపైగా దరఖాస్తులు, టీచర్లకు సంబంధించి 1200 వరకు రిజెక్ట్ అయ్యాయి. ప్రధానంగా ఆన్లైన్ దరఖాస్తుల్లోనే అత్యధికంగా ఉన్నాయి. దరఖాస్తు సమయంలో పూర్తి వివరాలు నింపకపోవడం, ఓటర్ గుర్తింపు కార్డుకు సంబంధించిన వివరాలు సంపూర్ణంగా ఇవ్వకపోవడం, చిరునామాల్లో పొంతన లేకపోవడం, ఫోన్నంబర్ల ఎంట్రీల్లో తప్పులు దొర్లడం వంటి అనేక కారణాలు దీనికి కారణం అయ్యాయి. వ్యక్తుల కన్నా.. వ్యవస్థలే ఎక్కువగా ఎంట్రీ చేయడం వల్లే వేల సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం వచ్చే మార్చితో ముగుస్తుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం, ఓటర్ నమోదుకు అవకాశం కల్పించింది. ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్టు ముందు ప్రకటించినా సైట్ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. అంటే నేటికీ నమోదు చేసుకునే అవకాశమున్నది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినా అధికారులు మాత్రం నమోదు కొనసాగుతున్నదని ప్రకటించారు. కాగా, ఈ సారి పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం భారీగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఈనెల 8వ తేదీ రాత్రి వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 3,58,553 దరఖాస్తులు రాగా, అందులో 1,83,040 దరఖాస్తులను అధికారులు ఒకే చేశారు. ఇదే సమయానికి 17,778 మంది అప్లికేషన్లను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అంతేకాదు, గడిచిన రెండు గంటల్లో మరో రెండు వేల వరకు తిరస్కరించినట్టు తెలుస్తున్నది. ఇదే పరిస్థితి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలోనూ కనిపిస్తున్నది. ఈ నెల 8వ తేదీ రాత్రి వరకు మొత్తం 27,993 దరఖాస్తులు రాగా, అందులో 10,036 ఒకే కాగా 1,024 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయి. అంటే అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 10 నుంచి 15 శాతం వరకు రిజెక్టు అయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
ఎమ్మెల్సీగా పోటీ చేయాలని భావిస్తున్న ఔత్సాహిక అభ్యర్థులు నెల రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఓటరు నమోదును పెంచడానికి చాలా మంది తమ సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని, పట్టభద్రుల నుంచి ఆధార్‌కార్డు, డిగ్రీ ప్రొవిజనల్ తీసుకొని బల్క్‌గా నమోదు చేసేందుకు ఉత్సాహం చూపారు. ఎవరికి వారే తమ సిబ్బందిని పెట్టి గ్రాడ్యుయేట్ల నుంచి వివరాలు సేకరించారు. మరికొంత మంది ఒక అడుగు ముందుకేసి, ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. తామే వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తామంటూ ఫోన్ నంబర్లు ఇచ్చారు. అందుకోసం పోస్టర్లు, బ్యానర్లు కట్టి, ఫోన్ నంబర్లు ప్రచారం చేసుకున్నారు.
పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల వంటివి తిరిగి, గ్రాడ్యుయేట్ల నుంచి ఆధార్, డిగ్రీ సర్టిఫికెట్లు సేకరించి, ఎన్రోల్మెంట్ చేయించారు. నిజానికి ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 2,32,576 దరఖాస్తులు రాగా, 6వ తేదీ వరకు ఆ సంఖ్య 3,58,452కి చేరింది. అంటే కేవలం 48 గంటల్లోనే 1,25,876 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సైతం ఇదే కోవలో ఎన్రోల్మెంట్ జరిగింది. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం వరకు చూస్తే 16,150 దరఖాస్తులు రాగా, ఆ తర్వాత 48 గంటల్లో ఈ సంఖ్య 27,879కి చేరింది. అంటే రెండు రోజుల్లో 11,729 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు ప్రస్తుతం ఈ నెల 8వ తేదీ నాటికి చూస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం 3,58,553 దరఖాస్తులు రాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 27,993 వచ్చాయి.
కాగా, మెజార్టీ అంటే 98 శాతం దరఖాస్తులు ఆన్లైన్ ద్వారానే వచ్చాయి. వీటిని నిశితంగా పరిశీలిస్తే బల్క్‌గా నమోదు చేసే క్రమంలో అనేక పొరపాట్లు జరిగినట్టు తెలుస్తున్నది. ఫలితంగా వేల సంఖ్యలో దరఖాస్తులు రిజెక్టు అవుతున్నాయి. ప్రధానంగా ఔత్సాహిక పోటీదారులు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు బల్క్‌గా ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో చాలా వివరాలు మిస్ చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. నిజానికి చాలా మంది ఔత్సాహికులు.. పట్టభద్రుల నుంచి కేవలం డిగ్రీ ప్రొవిజనల్, ఆధార్‌కార్డు మాత్రమే సేకరించారు. కానీ, దరఖాస్తు ఓకే కావాలంటే కచ్చితంగా సంబంధిత వ్యక్తి ఓటర్ గుర్తింపు కార్డులోని వివరాలను దరఖాస్తు ఫారంలో నమోదు చేయాలి.
ఓటర్‌కార్డు నంబర్‌తో సహా పోలింగ్ స్టేషన్నంబర్ వంటివి విధిగా ఇవ్వాలి. కానీ, బల్క్ ఎంట్రీలో ఈ వివరాలు నమోదు చేయలేదని తెలుస్తున్నది. చాలా మందికి తమ ఓటర్ గుర్తింపు కార్డు వివరాలు తెలియకపోవడం, ఎన్నికల సంఘం సైట్లో పేర్లపై సెర్చ్ చేసినప్పుడు ఆ వివరాలు లభ్యం కాకపోవడం వల్లే బల్క్‌గా నమోదు చేసిన వ్యక్తులు ఏదో ఒక నంబర్ వేసి, ఎంట్రీ చేసినట్టు తెలుస్తున్నది. దీంతో అధికారులు పరిశీలిస్తున్నప్పుడు.. ఒక వివరానికి మరో వివరానికి పొంతన లేకుండా పోతున్నది. దీంతో రిజెక్టు కొడుతున్నారు. అంతేకాదు, బల్క్ నమోదులో మరో అతి పెద్ద మిస్టేక్ ఏమిటంటే.. సంబంధిత అభ్యర్థుల పోన్ నంబర్లకు బదులుగా ఇతరుల నంబర్లు వేశారు. దాంతో రిజెక్టు అయిన సమాచారం సంబంధిత వ్యక్తికి తెలిసే అవకాశం లేకుం డా పోతున్నది.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముసాయిదా జాబితాను చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. అలాగే బల్క్ ఎంట్రీలో మరో తప్పు జరిగింది. ఆధార్ కార్డు ఉన్న ఫొటో కు అప్లోడ్ చేసిన ఫొటోలకు మధ్య చాలా తేడా లు కనిపిస్తున్నది. ఇదికూడా రిజెక్టు కావడానికి ఒక కారణం అవుతున్నది. మరికొంత మంది.. ఆధార్ కార్డులో ఒక పేరుంటే దరఖాస్తులో మరోపేరు కనిపిస్తున్నది. అంటే దరఖాస్తు నింపే సమయంలో ఆధార్‌కార్డు నంబర్ ఎంట్రీ సరిగా జరగలేదని అధికారులు భావిస్తున్నారు. ఇలా అనేక కారణాల దరఖాస్తులు తిరస్కరణ గురికావడానికి కారణం అవుతున్నాయి.
దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు తమ ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలంటే.. కచ్చితంగా ముసాయిదా జాబితాను పరిశీలించుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. నిబంధనల ప్రకారం చూస్తే.. ఈ నెల 6వ తేదీలోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తామని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు అధికారులు వచ్చిన దదరఖాస్తులను పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అనుమానాలు ఉన్న దరఖాస్తులను రిజెక్టు చేస్తూ, అర్హత ఉన్న వాటిని ఓకే చేస్తున్నారు. ఈ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండగా, ముసాయిదా జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ నెల 23 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలుపడానికి అవకాశమున్నది. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అందులో అర్హులను జాబితాలో చేరుస్తారు.
అప్పుడు కూడా ఏమైనా అనుమానాలుంటే రిజెక్టు చేస్తారు. మొత్తంగా పూర్తి వివరాలు పరిశీలించి, డిసెంబర్ 30న కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. అయితే ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించే సమయంలోనూ అర్హులైన ఓటర్లు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రక్రియ నామినేషన్ చివరి తేదీ వరకు కూడా కొనసాగుతుందని వేర్వేరు ప్రకటనల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పట్టభద్రులు, పంతుళ్లు తమ ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు వారి వివరాలను తెలు సుకోవాల్సిన అవసరం ఉందన్న అభ్రిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.