జగిత్యాల, మార్చి 28: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని, బడ్జెట్లో రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రజల సంక్షేమం ఊసే లేదన్నారు. ముఖ్యమంత్రి నిత్యం ఢిల్లీ పర్యటనలకే పరిమితం అవుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిత్యం పోరాటం కొనసాగిస్తోందని, వైఫల్యాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన లేదన్నారు.
ఫీజురీయింబర్స్మెంట్పై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదని, ఆరు పంటలకు ఇవ్వాల్సిన రైతుబంధు మూడు పంటలకే ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేకిగా పని చేస్తోందన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏండ్లలో రూ.43వేల కోట్లు అభివృద్ధికి వెచ్చించిందన్నారు. తొలి సీఎం కేసీఆర్ అనుభవం, పరిపాలన అనుభవం, ఆయన సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వారు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పట్టణ, మండలాధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.